రెండు నెలలుగా ఇంట్లోనే పార్క్ చేసిన కారుకు 15ఫైన్ లు

సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన మోటరు వాహన చట్టంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. భారీగా ఫైన్ లు విధిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొన్ని చిత్రవిచిత్ర సంఘటనలు కూడా దేశవ్యాప్తంగా రోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు…కొన్ని నెలలుగా ఇంట్లో పార్క్ చేసి ఉన్న కారుకు 15చలానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ ఘటన జరిగింది.
బులంద్‌షహర్‌కు చెందిన అరుణ్ శర్మ.. మీరట్ రోడ్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తన మామయ్య హరిశంకర్ శర్మ పేరుతో రిజిస్ట్రర్ చేయబడిన కారును అరుణ్ వాడుతున్నాడు. అయితే ఆగస్టు నుంచి కారుని బయటకి తీయకుండా ఇంట్లోనే పార్క్ చేసి ఉంచాడు అరుణ్.
అయితే ఈ క్రమంలో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆగస్టు-16,2019నుంచి హరిశంకర్ శర్మకు ఈ చలాన్లు వస్తున్నాయి. ఈ జరిమానాల గురించి హరిశంకర్ తన అల్లుడు అరుణ్ శర్మని అడిగాడు. అయితే తాను చాలా రోజులుగా కారు ఇంట్లో నుంచి బయటికే తీయలేదని చెప్పాడు. అసలేం జరుగుతుందని తెలుసుకునేందుకు ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆశ్రయించాడు. అయితే అరుణ్ వినతిని అక్కడ ఎవ్వరూ పట్టించుకోట్లేదు. అయినా వారు చర్యలు చేపట్టకపోగా, చలానాలు వెంటనే చెల్లించాలని కోరారు. మరో పక్క అక్షరధామ్ ఏరియా,పలు చోట్ల ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారంటూ ట్రాఫిక్ ఫైన్ లు వస్తూనే ఉన్నాయి .
దీంతో విసిగిపోయిన అరుణ్ శర్మ స్వయంగా తానే రంగంలోకి దిగాడు. తమ కారు నెంబర్ ప్లేట్ మరొకటి చేయించుకుని తిరుగుతున్న ఓ కారుని ఢిల్లీలోని అక్షరధామ్ టెంపుల్ దగ్గర గుర్తించాడు. సేమ్ నెంబర్ ఫ్లేట్ ఉన్న కారు ఘజియాబాద్ సెక్టార్ 23ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారమందించాడు. స్పాట్ కి చేరుకున్న పోలీసులకు కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఓ ఐటీ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ సునీల్ కుమార్ గా గుర్తించారు. సునీల్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ క్యాబ్ ఓనర్ ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.