రైతన్నలకు శాల్యూట్..వ్యవసాయ రంగంలో సంస్కరణలతో మేలే

రైతన్నలకు శాల్యూట్..వ్యవసాయ రంగంలో సంస్కరణలతో మేలే

Updated On : January 25, 2021 / 8:53 PM IST

President Ram Nath Kovind మంగళవారం(జనవరి-26,2021)దేశం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న నేపథ్యంలో ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామన్​నాథ్​ కోవింద్​. కొన్ని సందర్భాల్లో తలెత్తే ప్రతికూలతలు గొప్ప పాఠాలు నేర్పిస్తాయని.. అవే మనల్ని మరింత శక్తివంతంగా తీర్చుదిద్దుతాయని కోవింద్ అభిప్రాయపడ్డారు. వీటితో విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ విశ్వాసంతో అనేక రంగాల్లో భారత్​ ముందడుగు వేసిందన్నారు. వైరస్‌తో కుదేలైన మన ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని అన్నారు. వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థకు దశలవారీగా చేపట్టిన అన్‌లాక్‌ ప్రక్రియ ఉపకరించిందని నిరూపితమైందని చెప్పారు.

వ్యవసాయం, కార్మిక రంగాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న సంస్కరణలు ఎట్టకేలకు కార్యరూపం దాల్చాయని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వెల్లడించారు. ఆర్థిక సంస్కరణలకు ఇవి ఊతమందిస్తాయన్నారు. వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణలపై తొలినాళ్లల్లో సందేహాలు ఉండటం సహజమేనని.. అయితే రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రైతులు, శాస్త్రవేత్తలు, సైనికులపై కోవింద్​ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రకృతి ప్రకోపాలు, కోవిడ్‌ మహమ్మారి సహా అనేక సవాళ్లను అధిగమించి దేశానికి అవసరమైన ఆహార ధాన్యాలను అందిస్తున్న రైతులకు ప్రతి భారతీయుడు శాల్యూట్‌ చేస్తారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. మన రైతాంగం సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా మెరుగైన వ్యవసాయ దిగుబడులను సాధిస్తున్నారని ప్రశంసించారు.

కరోనా వైరస్‌ను దేశం దీటుగా ఎదుర్కొందని, మహమ్మారిని కట్టడి చేసేందుకు మన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలోనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారని అన్నారు. కరోనా మహమ్మారితో ముందువరుసలో నిలిచి పోరాడిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల సేవలు మరువలేనవని కొనియాడారు.ఇతర దేశాల కన్నా భారత్​లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటాని శాస్త్రవేత్తలు, వైద్యులే కారణమన్నారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఆరోగ్య సిబ్బంది పూర్తి సన్నద్ధంగా ఉన్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. ఈ అవకాశం వినియోగించుకుని మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీవితంలో మీ ఎదుగుదలకు మీ ఆరోగ్యం కీలకమని సూచించారు.

మరోవైపు సియాచిన్​, గల్వాన్​ లోయలో నిరంతరం సైనికులు దేశ సరిహద్దును పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఎముకలు కొరికే చలిలోనూ విధులు నిర్వర్తిస్తుండటంపై గొప్ప విషయమన్నారు. గత ఏడాది మనం ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొన్నామని, మన సరిహద్దులపై విస్తరణ కాంక్షతో జరిగిన ఘటనలను అధిగమించామని గుర్తుచేశారు. సరిహద్దులను కాపాడే క్రమంలో 20 మంది వీరజవాన్లు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వీరసైనికుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు పక్షాలు పలుమార్లు చర్చలు జరిపాయని, సైనిక కమాండర్ల స్ధాయిలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.