తీవ్ర విషాదం, కల్తీ మద్యానికి 86మంది బలి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

పంజాబ్‌లో కల్తీ మద్యం కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ మద్యం తాగిన వారు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. మూడు జిల్లాల్లో శుక్రవారానికి 39మంది చనిపోగా.. శనివారానికి(ఆగస్టు 1,2020) ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 86కి చేరింది. నిన్న ఒక్కరోజే 47 మంది ప్రాణాలు వదిలారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అమృత్‌సర్, తర్ణ్ తారణ్, గురుదాస్‌పూర్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచే కలుషిత మద్యం కారణంగా మరణాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కల్తీ మద్యానికి ఒక్క గ్రామంలోనే 63మంది మృతి:
ఒక్క తర్ణ్ తారన్ లోనే 63మంది ఈ నకిలీ మద్యానికి బలయ్యారంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హెచ్చరించారు. ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశారు. ఏడుగురు ఎక్సైజ్, ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అమృత్ సర్ కేంద్రంగా కల్తీ మద్యం దందా నడుస్తోంది.