పూరీ శ్రీక్షేత్ర రత్నభండార్ తెరిచే కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..?
పాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్నభండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. పురాతన వస్తువులను బయటికి తీసే నిపుణుల టీమ్‌ను సిద్ధం చేశారు.

Jagannath Temple Ratna Bhandar: యావత్ దేశం శ్రీక్షేత్ర రత్న భండార్‌లో ఏముందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కానీ ఎక్కడో తెలియని భయం.. బయటికి చెప్పుకోలేని బెరుకు, గాభరా.. ఓ రకమైన ఆందోళన మాత్రం కనిపిస్తోంది. దేవదేవుని అపార సంపద గుట్టు విప్పాలని ఆసక్తిగా ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ. కాకపోతే రత్నభండార్ తలుపులు తెరవాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది.
పాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్నభండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పాములను ఆడించే మాంత్రికుడితో పాటు మెడికల్ కిట్‌తో సాయుధ బలగాల వైద్య బృందం, పురాతన వస్తువులను బయటికి తీసే నిపుణుల టీమ్‌ను సిద్ధం చేశారు. అంటే రత్న భండార్‌ను తెరిచే టీమ్‌లో ఎంత ఆందోళన ఉందో అర్థం చేసుకోవచ్చు.
కొన్నేళ్లుగా రత్న భండార్ రహస్య గది పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. రత్న భాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపునకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. మూడు తాళాలు ఉంటేనే గది తలుపులను పూర్తిగా తెరవచ్చు. అయితే ఓ తాళం లేదన్న కారణంతో మూడోగదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు ఓపెన్ చేయడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు.
మూడో గది తెరిచేందుకు ప్రయత్నం
1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మూడో గది తెరిచేందుకు ప్రయత్నం చేశారు. అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి ఒక్కసారిగా భయానక శబ్ధాలు, పాములు బుసలు కొట్టినట్లు సౌండ్ వినిపించడంతో అధికారులు భయపడి వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇదంతా వాస్తవం కాదంటున్నారు కొందరు అధికారులు. 1985, 2018లో మూడోగదిని తెరిచేందుకు వెళ్లిన అధికారులు మాత్రం పాముల బుసబుసలు అన్నది అవాస్తవమని చెబుతున్నారు.
కొందరు శ్రీక్షేత్ర ఆలయ అర్చకులు మాత్రం రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టమని హెచ్చరిస్తున్నారు. దేవుడి ఆదేశాలను కాదని ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనమేనని, విపత్తులు వస్తాయని చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యే పూరీ రథయాత్రలో అపశృతి చోటు చేసుకోవడం కూడా రత్నభండార్ తెరిచే ప్రయత్నం మొదలుపెట్టడమే అంటున్నారు. బలభద్రుని తాళధ్వజ రథం లాగుతుండగా తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోగా.. వందల మందికి గాయాలు అయ్యాయి. ఇవన్నీ రత్న భండార్‌ను తెరవాలనే ఆలోచనరాగానే జరుగుతున్న అనార్థాలనేది ఓ వర్గం అర్చకుల నమ్మకం.
లెక్కకు మించిన ధనరాశులు
పూరీలోని జగన్నాథుని ఆలయంలో కీలకమైన మూడో గదిలో లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. పాముల బుసబుసలు వినిపిస్తున్నాయన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? మూడో గదిని తెరిస్తే మటాషే అని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవమెంత? ఈ విషయంపై ప్రభుత్వం వేసిన కమిటీనే కాదు ఎవరూ ఓ అంచనాలకు రాలేకపోతున్నారు.
Also Read : ఐదు చెక్కపెట్టెల్లో వెలకట్టలేని వజ్ర, వైఢూర్యాలు.. లెక్కించడానికి అప్పట్లో 70 రోజుల సమయం!
అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభండార్ మూడోగది మిస్టరీగానే ఉండిపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరో నేలమాళిగను తెరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ నాగబంధం ఉందని భయపడి సిరిసంపదలున్న నేలమాళిగను తెరవకుండా ఆగిపోయారు.