ఏ కమిటీ వద్దు…కొత్త అగ్రి చట్టాలు రద్దు చేయాల్సిందే : కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన రైతులు

  • Published By: venkaiahnaidu ,Published On : December 1, 2020 / 07:13 PM IST
ఏ కమిటీ వద్దు…కొత్త అగ్రి చట్టాలు రద్దు చేయాల్సిందే : కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన రైతులు

Updated On : December 1, 2020 / 7:45 PM IST

don’t want any committee, farmers tell govt in meeting రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర మంత్రులు పియూష్ గోయల్,నరేంద్ర సింగ్ తోమర్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా దేశ రాజధానిలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 36 మంది రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది.



రైతు సంఘాలు,కేంద్ర మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్,పియూష్ గోయల్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. కనీస మద్దతు ధర,వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాలపై రైతులకు కేంద్ర మంత్రుల బృందం రైతు నేతలకు వివరించింది. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రుల బృందం ప్రతిపాదించింది.



రైతు సంఘాల నుంచి ఐదుగురు పేర్లను ప్రతిపాదిస్తే,ప్రభుత్వం నుంచి కొందరిని, వ్యవసాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది.అయితే, కమిటీ ఏర్పాటు చేస్తామంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. కమిటీ ఏర్పాటుతో సమస్య పరిష్కారం కాదని రైతు లీడర్లు పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు లీడర్లు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి మరోసారి రైతు సంఘాలతో చర్చించాలని కేంద్రం నిర్ణయించింది.



అయితే, రైతుల ఆందోళనలకు కారణమైన మూడు వ్యవసాయ చట్టాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఉపసంహరించుకునే ప్రశక్తే లేదని,దీనిపై ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం సృష్టంగా చెబుతోంది. ఈ చట్టాలపై రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకే రైతులతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం చెబుతోంది