INDIA ON COVID-19 : కరోనా సెకండ వేవ్, ప్రజల నిర్లక్ష్యం..పలు నగరాల్లో లాక్ డౌన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. నిబంధనలు, జాగ్రత్తలు ప్రజలు గాలికి వదిలేయడంతో.. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

INDIA ON COVID-19 : కరోనా సెకండ వేవ్, ప్రజల నిర్లక్ష్యం..పలు నగరాల్లో లాక్ డౌన్

India’s Covid-19 pandemic

Updated On : March 22, 2021 / 1:25 PM IST

COVID in India : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. నిబంధనలు, జాగ్రత్తలు ప్రజలు గాలికి వదిలేయడంతో.. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది పరిస్థితి ఎలా ఉందో.. ప్రస్తుతం అలానే ఉంది. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధించారు. స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సహా పలు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లో మార్చి 31 వరకు ఆంక్షలు పొడిగించారు. పుణెలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతోంది. మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రాత్రిళ్లు హోటళ్లు, బార్లు, షాపింగ్ మాల్స్ మూసివేస్తున్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, వడోదరాలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎవరూ బయటకు రాకూడదు. రాజస్థాన్‌లోని అజ్మీర్, భిల్వారా, జైపూర్, జోధ్‌పూర్, కోటా, ఉదయ్‌పూర్, సగ్వారా నగరాల్లో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ అమలుకానుంది. రాత్రి 10 తర్వాత దుకాణాలన్నీ మూసివేయాలి. ఇక 72 గంటల లోపు తీసిన కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే పర్యాటకులను ఈ నగరాల్లోకి అనుమతిస్తారు.

మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఎన్నడూ లేని రీతిలో ఒకే రోజు భారీ సంఖ్యలో అక్కడ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో ఇక్కడ 30 వేల 535 కొత్త కేసులను గుర్తించారు.దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24 లక్షల 79 వేల 682కు చేరింది. ఇక కోవిడ్ బారిన పడి ఒక్క రోజు వ్యవధిలో 99 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 53 వేల 399కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 2 లక్షల 10 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 2.15 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 13.5 శాతంగా ఉంది.

ఇక ఒక్క ముంబైలోనే 3 వేల 775 మంది కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నాగ్‌పూర్‌లో 3 వేల 614 కేసులు నమోదయ్యాయి. పుణే జిల్లాలో కొత్తగా 5 వేల 408 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క పుణేలోనే 2900 కేసులు రికార్డయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 11 వేల 314 మంది కరోనా రోగులు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. ఇక అక్కడ రికవరీ రేటు 89.32 శాతంగా ఉంది.