మహా రాజకీయంలో మలుపులు…పవార్ తో శివసేన ముఖ్యనాయకుడు భేటీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 31, 2019 / 03:15 PM IST
మహా రాజకీయంలో మలుపులు…పవార్ తో శివసేన ముఖ్యనాయకుడు భేటీ

Updated On : October 31, 2019 / 3:15 PM IST

మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఇవాళ ఎన్నికైన ఏక్ నాథ్ షిండే,శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యఠాక్రే,పలువురు శివసేన నాయకులు కొద్దిసేపటి క్రితం రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీతో సమావేశమయ్యారు.

శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమైన తర్వాత ఆ పార్టీ ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై పవార్ తో చర్చించినట్లు సంజయ్ రౌత్ తెలిపారు. 

చెరో రెండున్నసంవత్సరాల పాటు సీఎం సీటుని పంచుకోవాలని శివసేన చేస్తున్న ప్రతిపాదనను బీజేపీ ఒప్పుకోవడం లేదు. 5ఏళ్లు తానే సీఎం అని దేవేంద్ర ఫడ్నవీస్ బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. శివసేనకు 16మంత్రి పదవులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ చెబుతోంది. బీజేపీ తమ డిమాండ్ లకు ఒప్పుకోకుంటే ఎన్సీపీ తమకు మద్దతిచ్చేందుకు రెడీగా ఉందంటూ శివసేన బీజేపీని పరోక్షంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో పవార్ తో శివసేన నాయకుడు భేటీ చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటిమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ వచ్చినప్పటికీ పదవుల విషయంలో క్లారిటీ లేక ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు.