అమ్మ పోయాక మోడీనే నాన్నయ్యారు

  • Published By: vamsi ,Published On : March 9, 2019 / 11:30 AM IST
అమ్మ పోయాక మోడీనే నాన్నయ్యారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత ఆమె నడిపించిన పార్టీ  అన్నాడీఎంకే నాయకత్వ లేమితో ఎన్ని ఇబ్బందులు పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారంలో ఉన్న అన్నాడీఏంకేకు అప్పుడు మోడీ అండగా నిలిచాడంటూ తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.

అమ్మ జయలలిత చనిపోయిన తరువాత రాష్ట్ర ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ తండ్రిలా ఆదరిస్తున్నాడని ఆ రాష్ట్ర మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మ(జయలలిత) లేని  తమ పార్టీకి మోడీ తండ్రిలా వ్యవహరించారంటూ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వమంతా మోడీ ఆదేశాల మేరకే పనిచేస్తోందని, ఆయన దేశానికి కూడా తండ్రిలాండి వాడని మంత్రి అన్నారు.
Read Also : లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు.. ఆయన డిపార్ట్ మెంటే కదా : బుగ్గన

జయలలిత మరణం తర్వాత సంభవించిన అనేక పరిణామాల వెనుక బీజేపీ హస్తం ఉన్నట్లు విపక్షాలు విమర్శలు చేయగా అటువంటి వార్తలు అన్నీ వాస్తవమే అని మంత్రి చేసిన వ్యాఖ్యలతో స్పష్టం అయ్యింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.

శశికళను జైలుకు పంపడం, పళనిస్వామి, పన్నీరు శెల్వం మధ్య ఏకాభిప్రాయం కుదర్చడం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వల్లే కుదిరిందనే వార్తలు వచ్చాయి. ఆ సందేహాలన్నింటికీ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సమాధానం చెప్పకనే చెప్పినట్లు అయింది. తమిళనాడు రాష్ట్రంలో 39 సీట్లకుగాను బీజేపీ ఐదు స్థానాలకు, పీఎంకే ఆరు స్థానాలకు పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది. మిగతా స్థానాలలో అన్నాడీఎంకే పోటీ చేస్తుంది.

 

Read Also : జనసేన రైతు బంధు : ఎకరానికి రూ. 8వేలు