Parliament : పార్లమెంటు భద్రత వైఫల్య ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్

పార్లమెంటు భద్రత వైఫల్య ఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన మనోరంజన్ సహచరుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయికృష్ణను పొలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Parliament : పార్లమెంటు భద్రత వైఫల్య ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్

Updated On : December 21, 2023 / 12:09 PM IST

Parliament : పార్లమెంటు భద్రత వైఫల్య ఘటనలో మరో ఇద్దరిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన మనోరంజన్ సహచరుడు కర్ణాటకకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయికృష్ణను పొలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అతుల్ కులశ్రేష్ఠ అనే మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో మనోరజన్ కు సాయికృష్ణ రూమ్మేట్ గా ఉండేవాడని తెలుస్తోంది. దీంతో కర్ణాటకలోని బాగల్‌కోట్‌కు చెందిన సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ తండ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా రిటైరయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌కు చెందిన అతుల్ కులశ్రేష్ఠకు ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు గుర్తించారు. ‘బచ్చా’ అని కూడా పిలువబడే అతుల్‌కు రాజకీయ పార్టీలతో అనుబంధం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే విద్యార్థి జీవితం నుంచి షహీద్ భగత్ సింగ్ భావజాలంపై మక్కువ పెంచుకున్నాడు. భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్‌తో సంబంధం ఉన్న అతుల్ రైతుల ఆందోళనలో కూడా పాల్గొన్నాడు. పార్లమెంట్ చొరబాటుదారులతో అతడు ఫేస్‌బుక్‌లో చేసిన చాటింగ్ ఆధారంగా పోలీసులు అతుల్ ను అరెస్ట్ చేశారు. అతడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతుల్ అరెస్ట్ పై మాట్లాడటానికి అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

పార్లమెంట్ ఘటనలో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల్లో సాగర్ శర్మ, మనోరంజన్ డీ, అమోల్ షిండే, నీలం దేవి, లలిత్ ఝా, మహేశ్‌ కుమావత్ ఉన్నారు. కాగా.. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.

Also Read: ఓవైసీ సాబ్ కూడా నవ్వుతున్నారు.. కొత్త బిల్లులు ప్రవేశపెడుతూ అమిత్ షా ఎందుకిలా అన్నారు?

డిసెంబర్ 13న ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ లో ప్రవేశించి లోక్‌సభ హాల్లో దూకి పసుపురంగు స్మోక్ వదిలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యావత్ దేశం భయాందోళనలకు గురైంది. పార్లమెంట్ భద్రతపై ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఘటనపై విపక్షాలు అధికార పక్షాన్ని ప్రశ్నించటం.. హోమ్ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయటంతో పార్లమెంట్ చరిత్రలో ఎన్నడు లేని విధింగా 143 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటనపై ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి.