ఉత్తరాఖండ్ సీఎంకి కరోనా

Uttarakhand CM tests positive for Covid-19 భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపారు.
అయితే, ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. కర్ణాటక,మధ్యప్రదేశ్,హిమాచల్ ప్రదేశ్,అరుణాచల్ ప్రదేశ్,హర్యానా,గోవా,మేఘాలయ,మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాబారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
ఉత్తరఖాండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ శుక్రవారం ఓ ట్వీట్ లో…కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నాకు కరోనా లక్షణాలేవి లేవు. ఆరోగ్యంగానే ఉన్నాను. డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసేందుకు వచ్చిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. కొంతకాలం ఇంటి నుంచే పాలనా సంబంధమైన విషయాలను చక్కబెట్టనున్నట్లు సీఎం రావత్ స్పష్టం చేశారు.
కాగా,ఉత్తరఖాండ్ లో ఇప్పటివరకు 84,689కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,1384మరణాలు నమోదయ్యాయి. 76,223మంది కరోనా నుంచి కోలుకోగా,7వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇక, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1కోటి చేరువలో ఉండగా,మరణాల సంఖ్య 1లక్షా 45వేలకు చేరువలో ఉంది. దేశవ్యాప్తంగా 95లక్షల 20వేలమంది కరోనా నుంచి కోలుకున్నారు.