లిక్కర్ కు ఆధార్ లింక్ చేద్దామా! : కార్డు చూపించి బాటిల్ తీసుకోండి

రేషన్ కావాలా కార్డు చూపించు.. లోన్ కావాలా కార్డు జిరాక్స్ ఇవ్వు.. బస్సు, రైలు టికెట్టు.. చివరికి చచ్చిన తర్వాత స్మశానంలో కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే పనులు జరిగే రోజులు వచ్చేశాయి. తిండి కోసం కూడా ఆధార్ లింక్ చేసినోళ్లు.. మద్యంకి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు ఆ మినహాయింపు కూడా పాయే.. ఇక నుంచి మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్ ఎందుకు చూపించకూడదు అని తమిళనాడు హైకోర్టు సూచించటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. మద్యం షాపులకు కూడా ఆధార్ లింక్ చేయండి.. కార్డు చూపించినోళ్లకు మాత్రం లిక్కర్ ఎందుకు ఇవ్వకూడదు అనే ప్రశ్నతో కొత్త చర్చ మొదలైంది. మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్ చేసిన వ్యాఖ్యలు వెనక ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం.
Also Read: Surgical Strikes 2.0 : హైదరాబాద్ అప్రమత్తం
తమిళనాడులో ప్రైవేట్ మద్యం వ్యాపారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మద్యం షాపులు నిర్వహిస్తుంది. మధురైకి చెందిన అరుణ్ పాండ్యన్.. ప్రభుత్వ మద్యం వ్యాపారంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. కొత్త లైసెన్స్ కేటాయింపులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేసింది మధురై బెంచ్.
పిల్లలు, యువత మద్యం అలవాటుకు దగ్గర కాకుండా ఉండాలంటే ‘ఆధార్ కార్డు ఉంటేనే మద్యం అమ్మాలి’ అనే నిబంధనను తీసుకురావచ్చు కదా? అని వ్యాఖ్యానించింది. ఈ నిబంధన ఎందుకు తీసుకురావటం లేదని ఏకంగా తమిళనాడు ప్రభుత్వాన్నే ప్రశ్నించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న బార్ల దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ అభిప్రాయపడ్డారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని.. ఇది చాలా తీవ్రమైన సమస్య అని జడ్జీలు వ్యాఖ్యానించారు. బార్లలో మద్యం అమ్మకాలు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉండేలా నిబంధనలు తీసుకురావచ్చు కదా అని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
Also Read: రౌడీ ఇన్స్‌పెక్టర్ : నడిరోడ్డుపై వెంటాడి.. వేటాడి కొట్టాడు
ఇదే సమయంలో కొత్త లైసెన్స్ కేటాయింపులపై విచారణలో తమిళనాడు ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ‘ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో పారదర్శకంగా జరుగుతుందని, లైసెన్స్ కేటాయింపులపై ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు విధించవద్దు’ అని కోర్టును కోరారు. అయితే, ప్రైవేట్ మద్యం షాపుల ద్వారా ఏటా రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తుంటే, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రూ.25వేల కోట్ల ఆదాయం వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
Also Read: మానవబాంబుల తయారీ కేంద్రంగా బాలకోట్