రాజ్యసభ ఎన్నికలు.. 15 రాష్ట్రాల్లో 56మంది కొత్త సభ్యుల ఎన్నిక

సంఖ్యా బలాన్ని బట్టి ఏపీలో మూడు స్థానాలు అధికార వైసీపీలో చేరే అవకాశం ఉన్నా.. టీడీపీ కూడా అభ్యర్థిని నిలిపితే ఒక చోట ఎన్నిక అనివార్యం అవుతుంది.

రాజ్యసభ ఎన్నికలు.. 15 రాష్ట్రాల్లో 56మంది కొత్త సభ్యుల ఎన్నిక

Rajya Sabha Elections 2024

Rajya Sabha Elections 2024 : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లో 56మంది సభ్యుల ఎన్నికకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున మొత్తం 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యా బలాన్ని బట్టి ఏపీలో మూడు స్థానాలు అధికార వైసీపీలో చేరే అవకాశం ఉన్నా.. టీడీపీ కూడా అభ్యర్థిని నిలిపితే ఒక చోట ఎన్నిక అనివార్యం అవుతుంది. ఇక, తెలంగాణలో సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒక రాజ్యసభ స్థానం దక్కనుంది.

వచ్చే ఏప్రిల్ తో రాజ్యసభలో 56 స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాజ్యసభ ఎన్నికల కోసం ఫిబ్రవరి 8 నోటిఫికేషన్ జారీ చేస్తారు. 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16న పరిశీలన చేస్తారు. ఇక 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఫిబ్రవరి 27న మొత్తం 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు కూడా ప్రకటిస్తారు.

Also Read : జేడీయూతో దోస్తీ వద్దన్న బీజేపీ ఇప్పుడెందుకు రాజీపడినట్టు..? కమలం వ్యూహాం ఇదేనా?

ఎన్నికలు జరగనున్న మొత్తం 56 స్థానాల్లో 10 అత్యధిక సీట్లతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇక బీహార్, మహారాష్ట్రలో 6 చొప్పు.. వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ లో 5 చొప్పున.. గుజరాత్, కర్నాటకలో 4 చొప్పున.. రాజస్థాన్, తెలంగాణ, ఏపీలో 3 చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హర్యానా, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహిస్తారు.