నన్ను దెబ్బకొట్టడానికే : తొలి దశలోనే ఏపీ ఎన్నికలు

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 01:27 PM IST
నన్ను దెబ్బకొట్టడానికే : తొలి దశలోనే ఏపీ ఎన్నికలు

అమరావతి: ఎన్నడూ లేని విధంగా తొలి దశలోనే ఏపీలో ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల సమయంలో ఏపీలో ఎన్నికలు చివరి విడతలో జరిగాయి. ఈసారి మాత్రం ఫస్ట్ ఫేస్ లోనే జరగనున్నాయి. చాలా తక్కువ సమయంలోనే పోలింగ్ జరగనుంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నన్ను దెబ్బకొట్టడానికే ఏపీలో తొలి దశలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీని వెనుక ప్రధాని మోడీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. దాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్తామని చంద్రబాబు అన్నారు.

ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి ఏపీకి లక్ష కోట్లు రావాల్సి ఉందన్నారు. ఐదేళ్లైనా ఏపీకి రావడం లేదంటే జగన్ కు రాష్ట్రంపై ప్రేమ లేదన్నారు. జగన్ లాంటి ఆర్థిక నేరస్తుడికి ఏపీలో చోటు లేదన్నారు. మోడీ చౌకీదార్ కాదు చోర్ కీ దార్ అని మండిపడ్డారు. జగన్ జుట్టుపట్టుకుని ఏపీపై కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని అన్నారు. తప్పుడు పనులు చేసేందుకు తెలంగాణ అడ్డాగా మారిందని చంద్రబాబు విమర్శించారు. జగన్ కు ఓటు వేస్తే మనం మరణశాసనం రాసుకున్నట్టే అని ఏపీ ఓటర్లను చంద్రబాబు హెచ్చరించారు.

పొత్తులు, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీపైనా చంద్రబాబు స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్ సభ ఎన్నికల్లో కానీ జనసేనతో పొత్తు ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ పై ఆ రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.