అవసరమైతే జాతీయ పార్టీ పెడతా : సీఎం కేసీఆర్

కరీంనగర్ : దేశంలో మార్పు రావాలంటే ఫెరల్ ఫ్రంట్ రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. అవసరమైతే దేశాన్ని ఒక్కటి చేసి జాతీయ పార్టీని స్థాపిస్తాని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలన్నారు. విజన్ లేని జాతీయ పార్టీల నేతలతో దేశం అభివృద్ధి చెందదని తెలిపారు. భారత దేశం బాగుపడాలంటే ఎవరో ఒకరు కొత్త నేత రావాల్సిందేనని చెప్పారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచీగా ఉండాలన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన ఎన్నికల శంఖారావ ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
మోడీ, రాహుల్ ఇద్దరూ దొంగలేనని విమర్శించారు. వీళ్లా మన ప్రధాని అభ్యర్థులు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ దద్దమ్మలుంటే దేశం సస్యశ్యామలం కాదని స్పష్టం చేశారు. రాహుల్ తాత, ముత్తాతలు ప్రధానులయ్యారు.. ఇప్పుడు ఈయన పీఎం కావాలట.. అని వ్యంగాస్త్రాలు సంధించారు. ’మోడీని దొంగ అని రాహుల్ అంటారు.. రాహుల్ జమానత్ మీద తిరుగుతున్నారని మోడీ అంటారు’ అని తెలిపారు. 15 ఏళ్ల పాటు కృష్ణా నీటి పంచాయతీ సాగుతోందన్నారు. 2, 3 నెలలో తేల్చాల్సిన సమస్యను కాంగ్రెస్, బీజేపీ ఏళ్లపాటు సాగదీశాయని తెలిపారు. ఇలానా దేశాన్ని నడిపించే పద్ధతి అని ప్రశ్నించారు. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉంటే సద్వినియోగం చేసుకోరని విమర్శించారు. దేశంలో 3 లక్షల 44 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉందని.. వాడేది లక్షా 80 వేల మెగావాట్లు అని అన్నారు.
మతాన్ని పట్టుకుని బీజేపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని చెప్పారు. బీజేపీ నేతలే హిందువులా? మేం హిందువులం కాదా? మీకంటే నికార్సైన హిందువుల మేమే అని అన్నారు. ’నేను పూజలు చేస్తే మోడీకి ఏమైంది’ అని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వరని మండిపడ్డారు.
’20 ఏళ్ల కింద ఇదే గడ్డ మీద తెలంగాణ తెస్తానని నేను మాట ఇచ్చాను. ఈ ఒక్క పేదోనితోని ఏమైతదని మాట్లాడారు. చాలా అవహేళన చేశారు’ అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ వల్ల ఏమైతది అన్న చంద్రబాబు..ఇప్పుడు మూడు నెలల నుంచి మూడు వేల తిట్లు తిట్టారని అన్నారు. ’నేను ఆంధ్రాలో ఆయనను ఓడిస్తానని చంద్రబాబు భయపడుతున్నాడట’ అని అన్నారు. ఎల్ఎండీ కట్టడానికి సమైక్య పాలకులకు ఎన్నేళ్లు పట్టిందని ప్రశ్నించారు.
దేశానికే మార్గదర్శకంగా తాయారయ్యామని తెలిపారు. ఐదేళ్ల కింద తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందన్నారు. ఆదాయ వృద్ధి రేటులో తెలంగాణ నంబర్ వన్ అని అన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో రాష్ట్రం నెంబర్ వన్ అని అన్నారు. కాళేశ్వరంలో తరగని జల సంపద ఉందన్నారు. కరీంనగర్ జిల్లాలో మానేరు నది 150 కిలో మీటర్లు ప్రవహిస్తుందన్నారు. తెలంగాణ అద్భుత పద్ధతిలో అభివృద్ధిలో ముందుకుపోతుందన్నారు.