అమరావతిలో వెల్‌కం‌ గ్యాలరీకి శంకుస్థాపన

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 03:03 PM IST
అమరావతిలో వెల్‌కం‌ గ్యాలరీకి శంకుస్థాపన

అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్‌ ప్రభుత్వ సహకారం మరువలేనిదని చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేసిన వెల్‌కం గ్యాలరీకి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని స్టార్టప్ ఏరియా ఫేస్-1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అంకుర అభివృద్ధిలో భాగంగా వెల్‌కమ్‌ గ్యాలరీ నిర్మాణం చేపట్టినట్లు   చెప్పారు. సింగపూర్‌ ప్రభుత్వ మద్దతుతో.. టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నా, ప్రొజెక్టు చేయాలన్నా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. అమరావతిలో నిర్మించే వెల్‌కం గ్యాలరీ చాలామందికి అవకాశాలు కల్పిస్తుందన్నారు.

సింగపూర్‌తో సమానంగా రాజధాని నిర్మిస్తానని ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చానని.. దానికి సంబంధించిన ప్రణాళిక కోసం సింగపూర్‌ ప్రభుత్వాన్నే సంప్రదించామని బాబు చెప్పారు. ప్రణాళికలతో పాటు ఇతర అంశాల్లోనూ ఆ దేశం సహకరిస్తోందని తెలిపారు. వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, రాజధాని ఓ రూపాన్ని సంతరించుకుంటోదని చంద్రబాబు చెప్పారు.

ఏపీ‌, సింగపూర్‌ మధ్య బంధం రోజురోజుకీ బలపడుతోందని  సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు ఇతర రంగాల్లో సహకారానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో వెల్‌కం గ్యాలరీ కీలకంగా మారుతుందని.. దేశ, విదేశాల నుంచి అంతర్జాతీయ సంస్థలు రావాల్సి ఉందన్నారు. ఏపీ రాజధాని అత్యుత్తమంగా ఎదుగుతుందని చెప్పారు.

సింగపూర్‌ నుంచి పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. 15 కంపెనీలతో ఏపీ ప్రభుత్వానికి ఒప్పందాలు కుదిరాయి. సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.