సిట్టింగ్‌లలో జోష్‌ : అనుకూలిస్తున్న సంక్షేమ పధకాలు 

  • Published By: chvmurthy ,Published On : February 20, 2019 / 06:59 AM IST
సిట్టింగ్‌లలో జోష్‌ : అనుకూలిస్తున్న సంక్షేమ పధకాలు 

Updated On : February 20, 2019 / 6:59 AM IST

విజయనగరం : ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు సిట్టింగ్‌లకు భరోసా ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకున్న వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు తిరిగి అవకాశం కల్పిస్తున్నాయి. సంక్షేమపథకాల అమలుతో రాష్ట్రంలో ప్రభుత్వ అనుకూల పవనాలు  వీస్తున్నాయి. పనితీరు, విమర్శలు, ఆరోపణలతో వచ్చే ఎన్నికల్లో టికెట్‌ వస్తుందో రాదోనన్న డైలామాలో ఉన్న అధికార పార్టీ సిట్టింగ్‌లక్కూడా తాజాగా ప్రకటించి అమలు చేస్తున్న పథకాలతో ఆశలు పెరుగుతున్నాయి.  విజయనగరం జిల్లాలో జోష్ పెరిగిన సిట్టింగ్ లెవరో ఒకసారి చూద్దాం.

టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో  కురిపిస్తున్న వరాల జల్లు ప్రజల్లో ఆనందం నింపుతుంటే అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కొత్త జోష్‌ తీసుకువస్తోంది. ఫించన్ల మొత్తాన్ని రెట్టింపు చేయడం, రైతులకు పెట్టుబడి నిధిని ఇచ్చే భూధార కార్యక్రమం, డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయల చెక్కులు, స్మార్ట్ ఫోన్లు వంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఇవి ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత పెరిగిపోతోందనుకుంటున్న సమయంలో ప్రజాప్రతినిధులకు ఊరట కలిగిస్తోంది.

విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతపై మొన్నటి వరకు తీవ్ర వ్యతిరేక ప్రచారం జరుగుతూ వచ్చింది. ప్రజలకు అందుబాటులో ఉండరని, సొంత కేడర్ లేదని, ముఖ్యంగా ఎంపీ అశోక్ గజపతిరాజు విబేధించిన గంటా శ్రీనివాసరావుతో రాజకీయ సాన్నిహిత్యం పెంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్టు రాకపోవచ్చన్న బలమైన వాదన తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో రాబోయే ఎన్నికలకు అశోక్ గజపతిరాజు కుమార్తె అధితి గజపతిరాజును బరిలోకి దింపుతారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జనాల్లో జోష్ పెంచింది. అంతేకాదు జిల్లా కేంద్రానికి  వర్సిటీలు, కాలేజీలు తీసుకురావడంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత కృషి చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితిల్లో తిరిగి ఆమెకే టికెట్టు రావచ్చన్న వాదనా వినిపిస్తోంది.

నెల్లిమర్ల, చీపురుపల్లి, పార్వతీపురంలోనూ సేమ్‌ సీన్‌ కనిపిస్తోంది.  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన జరగడం, అదేస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు కావడంతో .. నెల్లిమర్లలో టీడీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని తెలుస్తోంది. దీంతో నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడుకే తిరిగి టికెట్టు వచ్చే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటకీ తాజాగా సంక్షేమ కార్యక్రమాలు ఆమెకు సానుకూలతను తెచ్చిపెడుతున్నాయని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పనితీరే ఆమెకు సానుకూల అంశంగా మారుతోందంటున్నారు. 

మరోవైపు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేయడం, రైతులకు పెట్టుబడి నిధులు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు వంటి పథకాల అమలుతో వెనుకబడిన ఈ ప్రాంతాల్లో కొత్త జోష్ కనిపిస్తోందని చెబుతున్నారు. గిరిజనులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గాల్లో తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఊరట నిస్తున్నాయని  ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గడ్డుకాలమేనన్న ప్రచారం జరుగుతోంది.