నాక్కాదు, మీ మంత్రికి పంపండి.. మాణిక్కం ఠాగూర్ నోటీసులకు కేటీఆర్ ఘాటు రిప్లయ్
గతంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని కేటీఆర్ ట్వీట్ చేశారు.

KTR Counter To Manickam Tagore
KTR : సిరిసిల్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ కు నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు. ఈ నెల 28న సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. తన నోటీసులకు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు.
మాణిక్కం ఠాగూర్ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ నోటీసులు పంపాలని కోరారు.
Also Read : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్, మాజీమంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. గతంలో ఇంఛార్జిగా పని చేసిన ఠాగూర్ కు దాదాపు 50 కోట్లు ఇచ్చి పీసీసీ పోస్టును రేవంత్ రెడ్డి తీసుకున్నారని ఇప్పుడు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో కామెంట్ చేశారు. ఆ కామెంట్ కు సంబంధించి రెండేళ్లుగా రాజకీయ రగడ కొనసాగుతోంది. వాటిని అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు పదే పదే అవే కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా ఈ నెల 28న సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఠాగూర్ కు డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ పోస్టును కొనుకున్నారు అని గతంలో చేసిన కామెంట్స్ ను కోట్ చేస్తూ మళ్లీ ప్రస్తావించారు కేటీఆర్. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గతంలో ఈ కామెంట్స్ చేయగా.. వారిపై పరువు నష్టం దావా వేశారు. వారిద్దరూ మధురై కోర్టుకు హాజరయ్యారు. ఈ అంశాన్ని కోట్ చేస్తూ ఠాగూర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కేటీఆర్ కూడా తనకు సమాధానం చెప్పాలంటూ నోటీసు జారీ చేశారు ఠాగూర్. 7 రోజుల్లో రిప్లయ్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read : తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఎంపీ బరిలో సోనియా గాంధీ..!
దీనికి ట్విట్టర్ లోనే ఠాగూర్ కు రిప్లయ్ ఇచ్చారు కేటీఆర్. ఇవి తాను చేసిన కామెంట్స్ కాదని, గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే నేను ప్రస్తావించాను అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యాఖ్యలను ఎక్కడా వెనక్కి తీసుకోలేదు కాబట్టి, ఆ కామెంట్స్ కు ఆయన కట్టుబడి ఉన్నారని, అవే వ్యాఖ్యలను నేను కూడా ప్రస్తావించాను తప్ప నేను వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు కావని రిప్లయ్ ఇచ్చారు కేటీఆర్.