మళ్ళీ సీఎం కావాలని ఆశీర్వదించండి : శాసన సభలో చంద్రబాబు

  • Published By: chvmurthy ,Published On : February 8, 2019 / 03:12 PM IST
మళ్ళీ సీఎం కావాలని ఆశీర్వదించండి : శాసన సభలో చంద్రబాబు

Updated On : February 8, 2019 / 3:12 PM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి వయాడక్ట్ అనే తారక మంత్రాన్ని ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.  ఆలోచనలే మన పెట్టుబడి అని .. వాటి ద్వారానే సంపద సృష్టికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ాశాసనసభలో 2019-24 విజన్ డాక్యుమెంట్ 2.0 ను ప్రవేశపెట్టిన సీఎం.. ఆనందంతో కూడిన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందిస్తామన్నారు.  ఈ సందర్భం గా ఏపీని ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ దార్శనిక పత్రాన్నే తమ ఎన్నికల మేనిఫెస్టోగా మార్చుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఆశీర్వదించాలని శాసనసభ వేదికగా ప్రజలను అభ్యర్ధించారు. మరోవైపు  రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రం మెడలు వంచైనా హక్కులు సాధిస్తామని స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9.30 లక్షల కోట్లుగా ఉందని దీన్ని  2024 నాటికి 23 లక్షల కోట్లకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభలో 2019-24 దార్శనిక పత్రం 2.0 ను ప్రవేశపెట్టిన సీఎం.. ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధికి వయాడక్ట్ అనే తారక మంత్రాన్ని ఇచ్చామని తెలిపారు. ఆలోచనలే పెట్టుబడిగా వాటి ద్వారానే సంపద సృష్టికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు.  తన ప్రసంగంలో బుద్ధుడు, అంబేద్కర్, మహాత్మాగాంధీ, సింగపూర్ మాజీ ప్రధాని లీక్వాన్యు, యాపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ తదితరుల వ్యాఖ్యలను ఊటంకించిన ముఖ్యమంత్రి. సూర్యోదయ రాష్ట్ర బ్రాండ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయల ఆదాయం సాధించి పెట్టటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ప్రతీ  ఒక్కరూ పారిశ్రామికవేత్తగా మారాల్సిన అవసరముందన్నారు. 2 వేల నుంచి 3 వేల ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నామని చంద్రబాబు తెలిపారు. దేశంలో ఎక్కడా ఆనందకరమైన అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం కార్యకలాపాలను నిర్వహించటం లేదని  ఏపీఒక్కటే సమీకృత అభివృద్ధి దిశగా పనిచేస్తోందని అన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో హ్యపీనెస్ కమిషన్ వేస్తామని ఆయన తెలిపారు. 

రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని  సీఎం తెలిపారు. కనీసం 3.75 లక్షల తలసరి ఆదాయం కంటే తక్కువ ఉంటే సదరు శాసనసభ్యుడే విఫలం అయినట్టుగా భావించాలని అన్నారు. పైసా లీకేజీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను పారదర్శకంగా అందిస్తోందని తెలిపారు. అవినీతికి పాల్పడటం ద్రోహమని ఆయన వ్యాఖ్యానించారు.  రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పంటలు ఎండిపోకుండా రెయిన్‌గన్‌ టెక్నాలజీ తీసుకొచ్చామని, రాయితీపై 12 వేల ట్రాక్టర్లు ఇచ్చామని, మరో 12 వేలు ఇస్తామన్నారు. ఆర్థిక బలహీన వర్గాలను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. చంద్రన్నబాట కింద 25 వేల కి.మీ మేర సీసీ రోడ్లు వేశామని, ఎన్టీఆర్‌ క్యాంటిన్ల ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నామని సీఎం చెప్పారు. కిడ్నీ బాధితుల పెన్షన్లను పెంచామని, డయాలసిస్‌ కేంద్రాలను పెంచామన్నారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని, కాపులకు 5 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకున్నామని, బీసీలకు సబ్‌ప్లాన్‌..అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు.