ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్.. 100మంది రండి : సభలో రోజా మగధీర డైలాగ్

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో తనతో, వైసీపీ ఎమ్మెల్యేలతో దారుణంగా వ్యవహరించారని వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేస్తుంటే సభ నుంచి బయటకు లాగేశారని గుర్తు చేశారు. రూల్స్ కు విరుద్ధంగా, కక్షతో తనను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి అక్షింతలు వేసిందన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా సభలోకి రానివ్వకుండా తనను అవమానించారని వాపోయారు. సభ నుంచి అమానవీయంగా లాక్కెళ్లారని అన్నారు.
నా సస్పెన్షన్ పై అసెంబ్లీ బయట జగన్ నిరసనకు దిగితే స్పీకర్ పట్టించుకోలేదన్నారు. ఇంతచేసిన చంద్రబాబు.. ఇప్పుడు గట్టిగట్టిగా ఎందుకు అరుస్తున్నారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. గతంలో మార్షల్స్ తో మమ్మల్ని బయటకు గెంటించినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు వచ్చిందన్నారు. గట్టిగా అరిస్తే.. గడ్డిపరక.. గర్జించే సింహం కాలేదని చురకలు అంటించారు రోజా.
చంద్రబాబు మగధీర డైలాగులు చెబుతున్నారని రోజా సీరియస్ అయ్యారు. ఒక్కొక్కరు కాదు 100మంది రండి అన్నట్టు.. 150మందికి సమాధానం చెప్పా అన్న విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. బోండా ఉమ.. నన్ను ఇక్కడ పాతిపెడతా అన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు? అని రోజా ప్రశ్నించారు.