నిజామాబాద్ స్థానిక పోరు : ఎన్నికల బరిలో రైతులు

  • Published By: madhu ,Published On : April 21, 2019 / 02:17 PM IST
నిజామాబాద్ స్థానిక పోరు : ఎన్నికల బరిలో రైతులు

Updated On : April 21, 2019 / 2:17 PM IST

స్థానిక నగారా మోగడంతో MPTC, ZPTC ఎన్నికలపై రైతన్నలు దృష్టి సారించారు. స్థానిక పోరులో ఉండాలని డిసైడ్ అయ్యారు. ఎర్రజొన్న పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌తో.. 178 మంది రైతులు నిజామాబాద్ లోక్ సభ బరిలో నిలిచి జాతీయ స్దాయిలో చర్చకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. తమ సమస్య జాతీయ స్ధాయిలో చర్చ జరిగిందని..అయినా సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో..పరిషత్ ఎన్నికల్లోను తమ అభ్యర్దులను నిలపాలని రైతులు భావిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్దులు వారికి మద్దతు ఇచ్చిన రైతు సంఘాల సభ్యులు కమిటీగా ఏర్పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి పోటీ చేయలేమని.. పరిషత్ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్దిని గెలిపించుకుంటామని రైతులు చెబుతున్నారు. ఈ మేరకు త్వరలో ప్రతీ మండలానికి ఓ కమిటీని వేసుకునేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు రైతులు తెలిపారు.

గెలుపు ఓటములు పక్కన పెడితే రైతుల పోటీ అంశం రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రైతులు తమ కార్యాచరణ ప్రకటించేలా రెడీ అవుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచి..కొత్త ఒరవడి సృష్టించిన పసుపు రైతులు ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ కి సై అంటూ రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. రైతుల పోరాటం ఎటువైపునకు దారి తీస్తుందో వేచి చూడాలి.