కాంగ్రెస్‌ శంఖారావం : రాహుల్‌ సభకు ఏర్పాట్లు

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 02:44 AM IST
కాంగ్రెస్‌ శంఖారావం : రాహుల్‌ సభకు ఏర్పాట్లు

Updated On : March 9, 2019 / 2:44 AM IST

రంగారెడ్డి : తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ మార్చి 9 శనివారం శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక్కరోజు పర్యటన కోసం ఆయన తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తొలి సభ కావడంతో ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేసింది.

ఇవాళ కర్నాటకలో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాహుల్‌ అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు వస్తారు. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలో కనీస ఆదాయ పథకాన్ని రాహుల్‌ ప్రకటించనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 32వేల బూత్‌ స్థాయి కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

పహాడీ షరీఫ్‌లో ఉన్న గ్రౌండ్‌లో దాదాపు మూడు లక్షల మందిని జనసమీకరణ చేసేందుకు పీసీసీ కసరత్తు చేసింది. పార్లమెంట్‌ ఎన్నికల వేళ రాహుల్‌తో నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో… రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ కుంతియా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలు, రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమై చర్చించారు. అనంతరం పహాడీ షరీఫ్‌లోని గ్రౌండ్‌ను ముఖ్యనేతలంతా పరిశీలించారు.

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధిస్తామన్న ధీమాలో ఉన్న కాంగ్రెస్‌… ఎన్నికల ప్రచారం రాహుల్‌తో ఓపెనింగ్‌… గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్‌ చేసింది. సభ నిర్వహణకు సమయం తక్కువగా ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.