బీసీలకు వరాలు:జయహో బీసీ సభలో చంద్రబాబు

  • Published By: chvmurthy ,Published On : January 27, 2019 / 01:02 PM IST
బీసీలకు వరాలు:జయహో బీసీ సభలో చంద్రబాబు

Updated On : January 27, 2019 / 1:02 PM IST

రాజమహేంద్రవరం: టీడీపీ అధికారంలోకి వచ్చాక  బీసీలకు  గుర్తింపు వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.  ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా బీసీల కోసం కృషిచేసింది టీడీపీయేనని ఆయన అన్నారు. స్ధానిక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన “జయహో బీసీ” సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీలను అణగ దొక్కారని, రాజశేఖర్ రెడ్డి  బీసీలకు అన్యాయం చేశారని, ఆయన హాయాంలో బీసీ మంత్రులను జైలు పాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. వెనుకబడిన వర్గాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అణగ దొక్కారని, మిగులు బడ్జెట్ ఉన్నా ఖర్చు పెట్టలేదని బాబు తెలిపారు.
“నేను మీకు అండగా ఉంటా, టీడీపీ మీకు అండగా ఉంటుంది, మీరు అన్నిరకాలుగా పైకి వచ్చేంతవరకు మీకు చేయూతగా ఉంటానని హామీ ఇస్తున్నానని” చంద్రబాబు  బీసీలకు హామీ ఇచ్చారు.  రాష్ట్రంలో 8 మంది బీసీలను మంత్రులను చేశామని ఆయన చెప్పుకొచ్చారు. బీసీ విద్యార్దుల విదేశీ విద్యకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామని, చేనేత కార్మికులకు  నెలకు 150 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని ఆయన తెలిపారు. బీసీలను ఆదరించి గుర్తింపు తెచ్చిన  నాయకుడు ఎన్టీఆర్ అని, తాను సీఎం అయ్యాక బీసీలకు 33 శాతం రిజర్వేషన్  కల్పించానని చంద్రబాబు నాయుడు చెప్పారు. బీసీ రిజర్వేషన్లను టీఆర్ఎస్ రద్దుచేసిందని, దానకి వైఎస్ జగన్ మద్దతు తెలుపుతున్నారని అన్నారు.