టీడీపీకి మరో షాక్…పోటీ నుంచి తప్పుకున్న శ్రీశైలం అభ్యర్థి

పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ సీటు దక్కించుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ సీటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు సోమవారం(మార్చి-18,2019) సంచలన ప్రకటన చేశారు టీడీపీ నాయకుడు,శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.తన భార్య శైలజ అనారోగ్య పరిస్థితులే అందుకు కారణమని ఆయన తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నందుకు పార్టీ, కార్యకర్తలు, ప్రజలు తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసి తాను శ్రీశైలం నుంచి పోటీచేయలేనని చెప్పారు. ఈసారి శ్రీశైలం టిక్కెట్ తన సోదరుడికి ఇవ్వాలని కోరారు.అయితే, శ్రీశైలం నుంచి ఏవీ సుబ్బారెడ్డిని బరిలో దించాలని తెదేపా అధిష్ఠానం ప్రతిపాదించినట్టు సమాచారం.అధిష్ఠానం చేసిన ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సుబ్బారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది.టీడీపీ శ్రీశైలం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైఖరిపై తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల్పనూరులోని ఆయన ఇంటి దగ్గర నినాదాలు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆందోళనకు దిగారు. టీడీపీ ఇటీవల శ్రీశైలం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని ప్రకటించింది.