పవన్ రాయలసీమ పర్యటన.. అడ్డుకుంటామంటున్న విద్యార్థి జేఏసీ నేతలు

కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు అంటున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 04:29 AM IST
పవన్ రాయలసీమ పర్యటన.. అడ్డుకుంటామంటున్న విద్యార్థి జేఏసీ నేతలు

Updated On : February 12, 2020 / 4:29 AM IST

కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు అంటున్నారు.

కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధ, గురువారాల్లో కర్నూలులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలులో నిర్వహించే భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో జనసేన నాయకులు, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. 

పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి : విద్యార్థి జేఏసీ డిమాండ్ 
మరోవైపు పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు అంటున్నారు. రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే పవన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది. పవన్ మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించింది. సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుని పవన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని మండిపడుతోంది. సుగాలి ప్రీతి కేసు నిందితులను శిక్షించాలని మొదటి నుంచి తాము పోరాటాలు చేస్తున్నామని పేర్కొంది.

విద్యార్ధి జేఏసీ తీరుపై జనసేన నేతలు మండిపాటు
విద్యార్ధి జేఏసీ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్ ఎప్పుడూ రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడలేదని జనసేన నాయకులు అంటున్నారు. జనసేనాని పర్యటన కచ్చితంగా కొనసాగుతుందని. ఎవరు అడ్డుకున్నా పర్యటన ఆగదంటున్నారు. వైసీపీ నేతలు కావాలనే విద్యార్థులను రెచ్చగొడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఒకపక్క రాయలసీమ విద్యార్థి జేఏసీ.. మరోపక్క జనసేన కార్యకర్తలు ఎవరూ తగ్గకపోవడంతో.. ఖాకీలకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ఉత్కంఠను రేపుతోంది.