తెలంగాణలో కౌలుదారి వ్యవస్థను మా ప్రభుత్వం పట్టించుకోదు : కేసీఆర్

తెలంగాణలో కౌలుదారి వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోదన్నారు సీఎం కేసీఆర్.. రైతులకు అండదండగా ఉండడమే తమ విధానమని అన్నారు. పట్టా పాసుపుస్తకాల్లో అనుభవదారు కాలమ్ ఉండదని తేల్చిచెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చలో పైవిధంగా వివరణ ఇచ్చారు.
జాగీర్ దార్లు, జమీందార్లు ఉన్నప్పుడు కౌలుదార్లను రక్షించాలని అనుభవదారు వ్యవస్థను తీసుకొచ్చారు. ఆనాడు కౌలుదారీ చెల్లించింది. ఇప్పుడు కౌలుదారి వ్యవస్థను పట్టించుకోమని కేసీఆర్ స్పష్టం చేశారు. 93 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని అన్నారు. 25 ఎకరాల భూమి ఉన్నోళ్లు 28 శాతం మంది మాత్రమే ఉన్నట్టు చెప్పారు.
కొన్ని భూములు నాన్ అగ్రికల్చర్ కింద ఉన్నాయని, అనుభవదారు కాలమ్ వల్లే రైతులకు సమస్యలు ఉంటాయని చెప్పారు. ఆస్తులంటే భూములు ఒక్కటే కాదు. నగరాల్లో కూడా కంపెనీలు, ఇండ్లు కిరాయికి ఇస్తామన్నారు. అవి కూడా ఆస్తులుగానే పరిగణిస్తామన్నారు. భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు చెల్లిందని ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదన్నారు.
ప్రస్తుతమున్న అనుభవదారు కాలమ్‌తో చిన్న, సన్నకారు రైతులకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. అనుభవదారు కాలమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. రైతులకు అండదండగా ఉండడమే తమ ప్రభుత్వ విధానమని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వమే నేరుగా రైతులకు రైతుబంధు అందిస్తున్నప్పుడు అనుభవదారు కాలం అవసరమే లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.