బీజేపీకి ఉద్దవ్ సవాల్…దమ్ముంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టండి

  • Published By: venkaiahnaidu ,Published On : July 26, 2020 / 08:13 PM IST
బీజేపీకి ఉద్దవ్ సవాల్…దమ్ముంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టండి

Updated On : July 26, 2020 / 8:45 PM IST

దమ్ముంటే మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్ష బీజేపీకి సవాల్ విసిరారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. మధ్యప్రదేశ్‌లో నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, ప్రస్తుతం రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చే పని చేస్తుందంటూ ఆ రాష్ట్రంలో పెద్ద దుమారం జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని నడుపుతున్న ఉద్దవ్ థాక్రే ఈ సవాల్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్‌కు ఉద్దవ్ థాక్రే ఇంటర్వ్యూ ఇచ్చారు. మహారాష్ట్రలో ‘మూడు చక్రాల’ ప్రభుత్వం నడుస్తోందంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఉద్దవ్ కౌంటర్ ఇచ్చారు. తమది ‘త్రీ-వీలర్’ ప్రభుత్వం అయినప్పటికీ, దాని స్టీరింగ్ వీల్‌పై గట్టిగా నియంత్రణ తనకు ఉందని ఉద్దవ్ అన్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో కూడా కూటమిలోని మూడు పార్టీల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. పబ్లిక్ పాలసీల పరంగా కాంగ్రెస్ పార్టీకి కొన్ని సూచనలు చేస్తుంది. మా సమావేశం తర్వాత అవి క్లియర్ అయిపోతాయి. మా మధ్య సరైన సయోధ్య ఉంది. నేను రెగ్యులర్ గా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో మాట్లాడి ఆయన సూచనలు తీసుకుంటూ ఉంటా. అప్పుడప్పుడు సోనియాగాంధీతో కూడా మాట్లాడతా అని ఉద్ధవ్ తెలిపారు.

మహారాష్ట్రలో మూడు చక్రాల ప్రభుత్వం నడిస్తే మరి కేంద్రంలో ఉన్న ఎన్డీయేలో 30 నుంచి 35 పార్టీలు ఉన్నాయని, మరి అది రైలు బండి ప్రభుత్వమా అని ఉద్దవ్ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. మూడు చక్రాల వాహనం, బుల్లెట్ ట్రైన్ ఈ రెండింటిలో ఏది కావాలని నన్ను అడిగితే నేను మూడు చక్రాల వాహనాన్నే కోరుకుంటా. ఎందుకంటే అది అత్యధికమంది ప్రయాణించే వాహనం అని అన్నారు. పరోక్షంగా ముంబై – అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మీద సెటైర్లు వేశారు ఉద్దవ్.