అద్భుతం జరిగితేనే : బాబు సీఎం అవుతారు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలుస్తారు. ఎవరు సీఎం అవుతారు. ఇప్పుడీ ప్రశ్నలు రాజకీయవర్గాలతో పాటు సామాన్యుల్లో ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నా.. ఓటర్ దేవుడు ఎవరిని కరుణిస్తాడో చూడాలి. సీఎం చంద్రబాబు మాత్రం మళ్లీ నేనే అధికారంలోకి వస్తానని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే అదంత ఈజీ కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. టెన్ టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఉండవల్లి ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ప్రస్తుత పొజిషన్ బట్టి చూస్తే ఏదో అద్భుతం జరిగితేనే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆ అద్భుతం ఏంటన్నది తనకు కూడా తెలియదన్నారు. అద్భుతాలు చేసే సమర్ధత, దాని కోసం పోరాడే తత్వం బాబుకు ఉందన్నారు. జనాల్లో టీడీపీకి అంతగా ఆదరణ లేదన్నారు. జగన్‌కు మాత్రం బాగా ఆదరణ ఉందని చెప్పారు. అయితే రాబోయే మూడు నెలల్లో ఏదైనా జరగొచ్చన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులను కేటాయించడం, టికెట్లు లభించని వారి ప్రభావం, వాళ్లు మీడియా ముందు ఏం చెబుతారన్న అంశాలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. అందుకే, చివరి నిమిషం వరకూ చాలా జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయం ఉండవల్లి వ్యక్తం చేశారు.