16 ఎంపీ సీట్లు గెలుద్దాం : ఢిల్లీని శాసిద్దాం

  • Published By: chvmurthy ,Published On : March 8, 2019 / 01:51 PM IST
16 ఎంపీ సీట్లు గెలుద్దాం : ఢిల్లీని శాసిద్దాం

హైదరాబాద్: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకుని ఢిల్లీని శాసించాలని పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొంపల్లి లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంటరీ  నియోజకవర్గ స్ధాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ … టీఆర్ఎస్ పార్టీ  రాష్ట్రంలో ఏ అభివృధ్ది కార్యక్రమం చేపడదామన్నా కేంద్రం మోకాలడ్డుతోందని, హైదరాబాద్లో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు నిర్మిద్దామంటే ఆర్మీ స్దలాలు అడ్డు వస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించమని అడిగితే ప్రధాని మిన్నకుండి పోయారని కేటీఆర్ అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధకు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు  కేంద్రం ఇవ్వాలని, నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు.

గడచిన 5 ఏళ్లలో కేసీఆర్  కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పధకాలు అమలుద్వారా పేదింటి ఆడపిల్లల‌ పెండ్లికి మేనమామ‌లాగ ఉన్నారని చెప్పారు. “మనం చేపట్టిన రైతు బంధును కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టింది. దేశం మొత్తం మన పరిపాలనను చూస్తోంది. ఒక ఉద్యమ కారుడు, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా ఉండడం చాలా గొప్ప విషయమని అరుణ్ జైట్లీ గారు కేసీఆర్ గారి గురించి చెప్పారని కేటీఆర్ తెలిపారు. మోడి చేసింది, చెప్పడానికి‌ ఏం లేదని, మహిళలు పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులను డీ మానిటైజేషన్ తో ఎత్తుకుపోయాడని కేటీఆర్ అన్నారు.