Perni Nani : మీ జెండాలను మడత పెట్టడం ఖాయం- పవన్, చంద్రబాబుపై పేర్నినాని ఫైర్

పవన్ గుర్తుపెట్టుకో.. జగన్ దగ్గర బేరాలు ఉండవు. పవన్ కల్యాణ్ తన అన్న కంటే చంద్రబాబునే ఎక్కువగా ప్రేమిస్తాడు.

Perni Nani : మీ జెండాలను మడత పెట్టడం ఖాయం- పవన్, చంద్రబాబుపై పేర్నినాని ఫైర్

Perni Nani Slams Pawan Kalyan

Perni Nani : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు వైసీపీ నేత పేర్నినాని. తాడేపల్లిగూడెంలో పవన్, చంద్రబాబు పంపకాలపై సంజాయిషీ చెప్పకునే సభ పెట్టారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఉన్న రెండు జెండాలు.. మూడో జెండా కోసం పెట్టిన సభ అది అని అన్నారు. ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలో చెప్పలేదు. ప్రజల సంక్షేమం గురించి ఒక్కమాట మాట్లాడలేదు. టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో జగన్ నామ స్మరణ తప్ప మరేమీ లేదన్నారు పేర్నినాని. జెండా సభ ద్వారా ఇచ్చిన సందేశం అదే అన్నారు.

”తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పలేదు. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే కార్యక్రమం ఏమైనా చేశారో చెప్పలేదు. పవన్ సినిమా వాళ్లు రాసిచ్చింది చెప్పాడు. జగన్ దగ్గర బేరాలు ఉండవు. నీ చేతనైంది చేసుకో. 2014, 2019లో ఏం చేశావు? నీవు సీట్లు తీసుకుంటే మాకేంటి? తీసుకోకుంటే మాకేంటి? ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి వాళ్లకు బాధ. బలి చక్రవర్తి దానవ రాజు.. దానం పొందింది వామనుడు. ఇక్కడ 24 సీట్లు దానం ఇచ్చింది చంద్రబాబు, పొందినది పవన్. మరి చంద్రబాబును తొక్కేయ్. పవన్ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నావ్. జాకీలు పెట్టి లేపుకుంటున్నావ్.

మన వాడు సీఎం కావాలని కాపులు అనుకుంటే శల్యుడి పాత్ర వహించావు. జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను, ఓటర్లను పవన్ నీరుగార్చాడు. డబ్బు డబ్బు అని పడిచచ్చే చంద్రబాబు, లోకేశ్ ల పట్ల నువ్వు శిఖండివి. జబర్దస్త్ డైలాగ్ లు రాస్తే పవన్ చెప్పారు. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా చంద్రబాబును తిట్టావు కదా? ఆ శతృత్వం ఏమైంది? 2014లో మోదీతో స్నేహం, 2019లో మోదీతో శత్రుత్వం, 2024లో మోదీతో స్నేహం. ఇది పవన్ చేసేది. నీ జెండా, చంద్రబాబు జెండా ప్రజలు మడత పెట్టడం ఖాయం. కాపు కులం గమనిస్తోంది. కాపులను బీసీలను చేస్తానని చంద్రబాబు మోసం చేశారు.

పవన్.. నీ రాజకీయమే తేడా అనుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి జగన్ ను రమ్మంటావ్. ఈ తేడా కూడా ఉందా నీలో. 24 సంఖ్యకి మాత్రమే కాదు.. ప్రతి సంఖ్యకి పురాణాల్లో ఏదో ఒకటి ఉంటుంది. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడం ఎంతో.. నిన్ను పట్టుకొని రాజకీయాల్లో మార్పు కోసం ప్రత్నించడం అలాంటిదే. పవన్ కల్యాణ్ తన అన్న కంటే చంద్రబాబునే ఎక్కువగా ప్రేమిస్తాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక జీరో నుంచి జగన్ ప్రారంభించారు. గెలిచే వరకు పోటీ చేయాలి. చంద్రబాబు గెలుపు కోసం పోటీ చేస్తున్నావ్. ఏ కులంలో పుట్టినా పేదల పక్షాన పోరాడి, వాళ్ల విద్య కోసం పోరాడే జగన్ ను కాపాడుకోవాలి. మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే నా గురించి పక్కవాడితో చెప్పమనే జగన్ కావాలో.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెప్పకోలేని చంద్రబాబు, పవన్ కావాలో ప్రజలు ఆలోచించాలి” అని పేర్నినాని సూచించారు.

Also Read : వైసీపీ జోరు, విపక్షం బేజారు.. ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుంది..?