చంద్రబాబే కొడుకుకు నేరం చేయడం నేర్పించాడు

ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాల కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ1 నిందితుడని, ఆయన కుమారుడు నారా లోకేష్ ఏ2 నిందితుడు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు చెప్పేవి అన్నీ నీతులు.. చేసేవన్నీ దొంగ పనులే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో చంద్రబాబు.. సైబర్ క్రైమ్‌కు తెరలేపారని, చంద్రబాబును కట్టడి చేసేందుకు కేంద్రం ఎందుకు ప్రయత్నించట్లేదంటూ ఆయన విమర్శించారు. లబ్ధిదారులు, వారి బ్యాంక్ అకౌంట్ల డేటాను ప్రభుత్వం తస్కరించిందంటూ కన్నబాబు మండిపడ్డారు.
ఆధార్ నుంచి ఆర్‌బీఐ వరకు అన్నిచోట్లా డేటా చోరీ చేశారని అన్నారు. అన్ని ప్రభుత్వ వ్యవస్థల నుంచి డేటాను చోరీ చేసి, ప్రజల డేటాను చోరీ చేసే అసాధ్యుడిగా బాబు పేరు తెచ్చుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు నేరం ఎలా చేయాలో నేర్పారని, సేవా మిత్ర యాప్ నిర్వహించే సంస్థతో మీకున్న సంబంధం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ సేవా మిత్ర యాప్‌లో ప్రజాడేటా ఎందుకు ఉందని నిలదీశారు. కలర్ ఫోటో ఉన్న ప్రజల డేటా వారికి ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. వీటన్నింటికి తండ్రికొడుకులు సమాధానం చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు.