చంద్రబాబు పార్టీలు మారోచ్చుకానీ ఇంకోకరు మారకూడదా ? : కొడాలి నాని

చంద్రబాబు తన పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించుకోలేక తన ఊర కుక్కలతో వైసీపీ మీద నిందలు వేయిస్తే ఊరుకునేది లేదని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. టీడీపీకి చెందిన దేవినేని అవినాష్ వైసీపీ లోచేరటం, టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వంశీ టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. పార్టీలు మారటం తప్పు అనే చంద్రబాబు మొదట తాను ఏపార్టీలో ఉన్నారో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
చంద్రబాబును ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిందని, తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అందులో చేరారని వివరించారు. టీడీపీ లో చేరాక ఎన్టీఆర్ రెండు సార్లు టికిటెక్ ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే చంద్రబాబు టీడీపీలో చేరితే తప్పులేదు కానీ, టీడీపీ నాయకులు వైసీపీలో చేరితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నప్పుడు చంద్రబాబుకు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ అని అప్పుడు గుర్తుకు రాలేదా..అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం ఎన్టీఆర్ కర్షక పరిషత్ పెట్టి అధ్యక్ష పదవి ఇస్తే…సరిగా పాలించటం లేదని చెప్పి, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న నాయకుడు చంద్రబాబని ఆరోపించారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారితే మాట్లాడని వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారన్నారు.
చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అప్పగించి సీబీఎన్ టీడీపీ పేరుతో పార్టీ పెట్టాలని సూచించారు. ఆ పార్టీ మీద ఒక్కరు గెలిచినా నేను రాజకీయాల్లోంచి తప్పకుంటానని కొడాలి సవాల్ విసిరారు. చంద్రబాబు లాగా జగన్ ఎమ్మెల్యేలను కొనటం లేదని, లోకేష్ వల్ల పార్టీ మునిగిపోతుందని భయపడి నాయకులు పార్టీ మారుతున్నారని అన్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే దశలవారీగా మద్యం పాలసీ అమలు చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ మీద ఆరోపణలు చేయటానికి కారణాలు దొరక్క నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని నాని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు.