గంటల వ్యవధిలోనే లక్షకు పైగా గణేశ్ విగ్రహాలు నిమజ్జనం.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.

గంటల వ్యవధిలోనే లక్షకు పైగా గణేశ్ విగ్రహాలు నిమజ్జనం.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

Updated On : September 18, 2024 / 12:12 AM IST

Hyderabad Ganesh Visrajan 2024 : హైదరాబాద్ నగరంలో వినాయకుల నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఇప్పటివరకు లక్షకు పైగా గణనాధుల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 గణనాథుల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద 4వేల 730, నెక్లెస్ రోడ్ వద్ద 2వేల 360, పీపుల్స్ ప్లాజా దగ్గర 5వేల 230 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ అల్వాల్ కొత్త చెరువులో 6వేల 221 వినాయకులను నిమజ్జనం చేశారు అధికారులు. గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది.

గంటల వ్యవధిలోనే లక్షకుపైగా విగ్రహాల నిమజ్జనం..
కాగా, కొన్ని గంటల వ్యవధిలోనే లక్షకుపైగా విగ్రహాలను నిమజ్జనం చేయడం చిన్న విషయం కాదన్నారు. నిమజ్జన కార్యక్రమం సాఫీగా సాగేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించారు. డ్రోన్ల కెమెరాలతో నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీపీ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు డీజీపీ, సీపీ సీవీ ఆనంద్ ఏరియల్ సర్వే చేశారు. పోలీసుల భారీ భద్రత, బందోబస్తు నడుమ నిమజ్జన కార్యక్రమం సాఫీగా సాగుతోంది.

Also Read : వామ్మో.. వేలంపాటలో రూ.1.87 కోట్లు పలికిన గణపతి లడ్డూ.. ఎక్కడో తెలుసా..

పోలీసుల పక్కా ప్లాన్.. సజావుగా నిమజ్జన కార్యక్రమం..
గణనాధులు.. మండపం నుంచి గంగమ్మ ఒడికి చేరే వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా బడా గణేశ్ విగ్రహాలను వీలైనంత త్వరగా నిమజ్జనం చేశారు. మధ్యాహ్నమే ఖైరతాబాద్, బాలాపూర్ గణేశులను గంగమ్మ ఒడికి చేర్చారు. ముందుగానే ట్రాఫిక్ ను మళ్లించడంతో పాటు విగ్రహాలు ఎక్కడా ఆగకుండా ట్యాంక్ బండ్ చేరేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గణేశ్ నిమజ్జనానికి సంబంధించి దాదాపు నెల రోజుల ముందే పక్కా ప్లానింగ్ చేశారు పోలీసులు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఎంజే మార్కెట్, నెక్లెస్ రోడ్ లో జనం కిక్కిరిసిపోయినా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగలేదంటే.. అందుకు పోలీసులు చేసిన ఏర్పాట్లు, తీసుకున్న జాగ్రత్తలే కారణం.