Chaitra Navratri 2026 Udyapan : రేపే వసంత నవరాత్రుల్లో ఆఖరి రోజు.. ఉద్యాపన సమయం, నియమాలు.. ఈ పూజ చేస్తేనే కోరుకున్న ఫలితం
Chaitra Navratri 2026 Udyapan : చైత్ర నవరాత్రులు రేపటితో ముగుస్తాయి. మరి ఉద్యాపన నియమాలు.. ఆ రోజు చేయాల్సిన పూజ వంటి వాటి వివరాలు
Chaitra navratri 2026 Udyapana Procedure and dos and don'ts on that day
Chaitra Navratri 2026 Udyapan : ఉగాది పండుగ నుంచి వసంత నవరాత్రులు మొదలయ్యాయి. శ్రీరామనవమితో ముగుస్తాయి. శరన్నవరాత్రుల మాదిరే చాలా మంది ఎంతో భక్తిశ్రద్ధలతో వసంత నవరాత్రులను కూడా జరుపుకుంటారు. అయితే తొమ్మిది రోజులు ఎంత నిష్టగా పూజ చేశామో.. చివరి రోజు అంతే భక్తితో ఉద్యాపన పూర్తి చేయాలి. అలానే పూజ సమయంలో వినియోగించిన పూలు, కుంకుమ వంటి వాటిని ఏం చేయాలో పండితులు వివరిస్తున్నారు.
వసంత నవరాత్రులను తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్న తర్వాత, చివరి రోజైన నవమి (చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి) రోజే ఉద్యాపన చేసుకోవాలి. అయితే ఈ నవరాత్రుల సందర్భంగా.. ఉదయం పూట పూజ చేసేవారైనా లేదా సాయంత్రం పూజ చేసేవారైనా సరే, కచ్చితంగా నవమి రోజున మాత్రమే ఉద్యాపన చెప్పుకోవాలి. ఉద్యాపన రోజు కచ్చితంగా సుభాసిని (సువాసిని) పూజ తప్పనిసరిగా చేయాలి.
వీలైనవారు ఒక పెద్ద ముత్తైదువును రేపు అంటే శ్రీరామనవమి నాడు ఇంటికి పిలిచి.. సుభాసిని పూజ తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ ముత్తైదువును పిలిచి పూజించే శక్తి లేదా వీలు లేని వారు, సాక్షాత్తు ఆ అమ్మవారినే పెద్ద ముత్తైదువుగా భావించి సువాసిని పూజను చేసుకోవచ్చు.
నియమాలు..
- ఉద్వాసన చెప్పే రోజున కూడా ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తీసుకోకూడదంటున్నారు పండితులు.
- దీపారాధన: పూజ ముగిసిన తర్వాత కూడా నిత్యం దీపారాధన కొనసాగించాలని చెబుతున్నారు.
పూజా ద్రవ్యాల వినియోగం:
- కలశం నీళ్లు: కలశంలోని నీటిని ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది అంటున్నారు. ఇల్లంతా చల్లాక మిగిలిన నీటిని మొక్కలకు పోయాలని చెబుతున్నారు.
- పువ్వులు: పూజలో ఉపయోగించిన పువ్వులను పారే నీటిలో వేయాలి. అలా కుదరకపోతే.. ఎవరూ తొక్కని చోట గానీ, మొక్కల మొదట్లో గానీ వేయాలంటున్నారు.
- పసుపు, కుంకుమ: అమ్మవారికి సమర్పించిన పసుపు, కుంకుమలను ఇంట్లోని మహిళలు బొట్టుగా పెట్టుకోవచ్చు. లేదంటే పారే నీటిలో కలపవచ్చంటున్నారు.
- అక్షతలు: పూజలోని అక్షతలను అన్నంలో కలుపుకుని ప్రసాదంగా తీసుకోవచ్చు లేదా భద్రపరుచుకోవచ్చు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని 10tv ధృవీకరించడం లేదు.
