Tirumala : హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం (ఉదయం) స్వామివారు మలయప్పస్వామి రూపంలో చినశేష వాహనంపై దర్శనమిచ్చారు.

Tirumala
Tirumala : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం (ఉదయం) స్వామివారు మలయప్పస్వామి రూపంలో చినశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయంలోని శ్రీవారి కల్యాణ మండపంలోనే ఈ సేవలు నిర్వహిస్తున్నారు. ఇక శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య స్వామి వారు వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో హంసవాహనంపై దర్శనమిచ్చారు.
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.
శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శనివారం ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరుగుతాయి.