RR vs KKR : ఐపీఎల్ 2025లో కోల్‌కతా తొలి విజయం.. కెప్టెన్ రహానే ఏమన్నాడో తెలుసా?
రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన తరువాత కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

pic credit @@CricCrazyJohns
ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడినప్పటికి రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ పై సత్తా చాటింది. బుధవారం గౌహతి వేదికగా ఆర్ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడాడు. బౌలర్ల వల్లే ఈ మ్యాచ్‌లో గెలిచినట్లుగా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా స్పిన్నర్ మొయిన్ అలీ చాలా చక్కటి ప్రదర్శన చేశాడన్నారు. బ్యాటింగ్‌లో విఫలం అయినా బౌలింగ్‌లో అదరగొట్టాడన్నారు.
ఆర్ఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేలో (తొలి ఆరు ఓవర్లలో) చాలా చక్కటి బౌలింగ్ చేశామన్నాడు. మిడిల్ ఓవర్లు కూడా ముఖ్యమైనవే అని చెప్పాడు. స్పిన్నర్లు మ్యాచ్ పరిస్థితులను నియంత్రించిన విధానం అద్భుతం అని చెప్పాడు. ఇక మొయిన్ తనకు వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
టీ20 ఫార్మాట్ అనగానే ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని అనుకుంటారు. అందుకనే వారికి కావాల్సిన స్వేచ్ఛను ఇచ్చినట్లుగా చెప్పాడు.
RR vs KKR : కావాలనే క్వింటన్ డికాక్ సెంచరీని అడ్డుకున్న ఆర్చర్..
‘ఇక ఈ విజయం క్రెడిట్ ఖచ్చితంగా బౌలర్లదే. ప్రతి బంతికి వికెట్ తీయాలనే తపనతో బౌలింగ్ చేశారు. మొయిన్ నాణ్యమైన ఆల్‌రౌండర్. గతంలోనూ అతడు ఓపెనర్‌గా వచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌లో విఫలం అయినా, బౌలింగ్‌లో రాణించడం పట్ల సంతోషంగా ఉన్నాం.’ అని రహానే అన్నాడు. ఇక ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్ (33), యశస్విజైస్వాల్ (29), రియాన్ పరాగ్ (25)లు రాణించారు. సంజూ శాంసన్ (13), నితీశ్ రాణా (8), వనిందు హసరంగ (4)లు విఫలం అయ్యారు.
అనంతరం క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్) దంచికొట్టడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది.