Sanju Samson : సంజూ శాంసన్ కొంపముంచిన శుభ్‌మన్ గిల్? 10 ఏళ్లు.. 42 మ్యాచ్‌లు.. కేరళ కుర్రాడి ఖేల్ ఖతం?
టీమ్ఇండియాలో మోస్ట్ బ్యాడ్ లక్ ప్లేయర్ ఎవరు అంటే చాలా మంది ఠక్కున చెప్పే సమాధానం సంజూ శాంసన్.

Asia Cup 2025 will Shubman Gill replace Sanju Samson opening spot
Sanju Samson : టీమ్ఇండియాలో మోస్ట్ బ్యాడ్ లక్ ప్లేయర్ ఎవరు అంటే చాలా మంది ఠక్కున చెప్పే సమాధానం సంజూ శాంసన్(Sanju Samson). అప్పుడెప్పుడో 2015లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఈ పదేళ్ల కాలంలో అతడు ఆడిన టీ20ల సంఖ్య కేవలం 42 మాత్రమే. సిరీస్‌లకు ఎంపికైనా కూడా తుది జట్టులో చోటు దక్కని సందర్భాలు ఎన్నో. రాక రాక జట్టులో అవకాశం వస్తే.. వాటిని మిస్ చేసుకుంటాడు అనే అపవాదు ఉండేది.
అయితే.. గత సంవత్సర కాలంగా అతడు నిలకడగా ఆడుతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన టీమ్ఇండియా ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. జట్టులో కుదురుకున్న అతడికి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. అది కూడా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రూపంలో.
ఓపెనర్‌గా గిల్ వస్తే..
భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ను నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏడాదిగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో జట్టుకు దూరంగా ఉన్నప్పటికి కూడా అతడికి ఆసియా కప్‌లో చోటు దక్కింది. అంతేకాకుండా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను సైతం ఇచ్చారు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గిల్ ఎక్కువగా ఓపెనర్‌గానే ఆడతాడు అన్న సంగతి తెలిసిందే.
Kris Srikkanth : ఈ జట్టుతో ఆసియాకప్ గెలుస్తారేమో గానీ.. సెలక్టర్లను ఉతికి ఆరేసిన క్రిస్..
వైస్ కెప్టెన్ కావడం, భవిష్యత్తులో అతడే మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉండడంతో అతడికి ఆసియాకప్ 2025లో తుది జట్టులో స్థానం ఖాయమే. కాగా.. గత ఏడాదిగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు. ఓపెనర్‌గా వీరిద్దరు కుదురుకున్నారు. ఎడమ చేతి వాటం ఆటగాడు కావడం, పైగా బంతిని బలంగా బాదే ఆటగాడు కావడంతో ఆసియాకప్‌లో అభిషేక్ శర్మ ఓ ఓపెనర్‌గా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమే. అతడికి తోడుగా శుభ్‌మన్ గిల్ వస్తే అప్పుడు సంజూ శాంసన్ పరిస్థితి ఏంటి ప్రశ్న ఉదయిస్తోంది.
మిడిల్ ఆర్డర్‌లో చోటుందా?
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఉండడంతో మిడిల్ ఆర్డర్‌లో సంజూ కు ఛాన్స్ కష్టమే. పోనీ ఫినిషర్‌గానైనా జట్టులో చోటు దక్కే పరిస్థితి ఉందా? అంటే.. రింకూ సింగ్, శివమ్ దూబెలతో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఉండడంతో శాంసన్ అక్కడ ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇక వికెట్ కీపర్‌గా అయిన శాంసన్‌కు జట్టులో చోటు ఉంటుందా? అంటే చెప్పలేని పరిస్థితి. ఐపీఎల్ ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే వికెట్ కీపర్ జితేశ్ శర్మ చోటు దక్కడం పెద్ద కష్టం కాదు. శాంసన్ టైమింగ్‌తో బంతిని బౌండరీకి తరలిస్తే.. జితేశ్ బలంగా బంతిని బాదతాడు అన్న సంగతి తెలిసిందే.
ఇలా ఏ లెక్కన చూసినా కూడా సంజూ శాంసన్ ఆసియాకప్ 2025 లో తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. ఒకవేళ పసికూనలు అయిన యూఏఈ లేదంటే ఒమన్ దేశాలపై అతడిని ఆడించే అవకాశాలు కొట్టిపారేయలేం. ఒకవేళ అతడు ఈ మ్యాచ్‌ల్లో గనుక విఫలం అయితే మాత్రం జట్టులో చోటు కోల్పోవడం ఖాయం. ఇప్పుడున్న పరిస్థితులు, పోటీపడుతున్న ఆటగాళ్లను పరిగణలోకి తీసుకుంటే 30 ఏళ్ల సంజూ మరోసారి టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే.
టీ20 ప్రపంచకప్ 2026లో చోటు దక్కాలంటే?
అంటే సంజూ శాంసన్ కెరీర్‌కు ఆసియా కప్ 2025 ఎంతో కీలకంగా మారనుంది. ఈ టోర్నీలో తుది జట్టులో అవకాశం దక్కించుకుని రాణిస్తే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ టోర్నీలో విఫలం అయితే కేవలం టీ20ల్లో మాత్రమే టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడి అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే.
సంజూ శాంసన్ ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 16 వన్డేలు, 42 టీ20లు ఆడాడు. వన్డేల్లో 56.7 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 42 టీ20 మ్యాచ్‌ల్లో 861 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, రెండు అర్థశతకాలు ఉన్నాయి.