BCCI : టీ20 ప్రపంచకప్ విజేతపై కోట్ల వర్షం.. బీసీసీఐ భారీ నజరానా.. ఎంతంటే?
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ రెండోసారి నిలిచింది. ఈ క్రమంలో బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.

BCCI Announces Cash Reward For Under 19 Womens T20 World Cup Winner
మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. దీంతో భారత్ వరుసగా రెండో సారి అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.
తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణిత తలా రెండు వికెట్లు తీశారు. షబ్నమ్ ఓ వికెట్ సాధించింది. అనంతరం గొంగడి త్రిష (33 బంతుల్లో 44 నాటౌట్) పాటు సానికా చాల్కే(22 బంతుల్లో 26 నాటౌట్) రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని 11.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి అందుకుంది.
బీసీసీఐ భారీ నజరానా..
వరుసగా రెండో సారి అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.5 కోట్ల నగదు బహుమతిని అందిచనున్నట్లు బోర్డు తెలిపింది.
‘వరుసగా రెండోసారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్ విజేతగా నిలిచిన భారత మహిళలకు శుభాకాంక్షలు. ఈ క్రమంలో వారికి నగదు బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాం. జట్టు, సహాయక సిబ్బందికి, హెడ్ కోచ్‌కు కలిపి రూ.5కోట్ల నగదు పురస్కారాన్ని అందజేస్తాం.’ అని ఓ ప్రకటనలో బీసీసీఐ తెలిపింది.
BCCI Congratulates #TeamIndia Women’s U19 Team for Back-to-Back T20 World Cup Triumphs, announces a cash reward of INR 5 Crore for the victorious squad and support staff, led by Head Coach Nooshin Al Khadeer.#U19WorldCup
Details 🔽
— BCCI (@BCCI) February 2, 2025
అండర్-19 మహిళల జట్టుకు హైదరాబాద్‌కు చెందిన నౌషీన్ అల్ ఖదీర్ హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. ఈ మెగాటోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపు ఖచ్చితంగా దేశంలో మహిళల క్రికెట్ ప్రాధాన్యతను మరింత పెంచుతుందని బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ వ్యాఖ్యానించారు.
త్రిష టాప్ స్కోరర్..
అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా రాణించింది. బ్యాట్‌తో, బంతితో సత్తా చాటింది. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 76.25 సగటుతో 305 పరుగులు చేసింది. ఇక స్కాట్లాండ్ శతకంతో చెలరేగింది. ఈ క్రమంలో అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది. ఇక బౌలింగ్‌లోనూ 7 వికెట్లు తీసింది.