Shakib Al Hasan : చిక్కుల్లో షకీబ్ అల్ హసన్.. పాక్‌లో క్రికెట్ ఆడుతుంటే.. బంగ్లాదేశ్‌లో మర్డర్ కేసు..
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు.

Case Filed Against Shakib Al Hasan In Bangladesh
Shakib Al Hasan : బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రభుత్వం రద్దు కావడంతో ఎంపీ పదవిని కోల్పోయిన షకీబ్ కు తాజాగా గట్టి షాక్ తగిలింది. అతడిపై హత్య కేసు నమోదైంది. ప్రస్తుతం షకీబ్ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో పాక్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో రూబెల్ అనే వ్యక్తి చనిపోయాడు. అతడి తండ్రి రఫీకుల్ ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు షేక్ హసీనా సహా 154 మంది పై కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ ఎంపీ అయిన షకీబ్ 28వ నిందితుడిగా ఉన్నట్లుగా ఢాకా మీడియాలో కథనాలు వెల్లడించాయి.
హసీనా రాజీనామా తరువాత నుంచి షకీబ్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. కెనడా నుంచి నేరుగా పాకిస్తాన్‌కు వెళ్లాడు. రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో బంగ్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రావల్పిండిలో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లు బౌలింగ్ చేసి 109 పరుగులిచ్చాడు. ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. పాక్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తరువాత అతడు బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తాడా..? లేదా..? అన్నది సందేహమే.
అతడి భార్య, పిల్లలు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అతడు పాక్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది.