IPL 2025: ఐపీఎల్‌లో ఆడుతున్నందుకు ఈ క్రికెటర్‌కు లీగల్ నోటీసులు పంపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్.. ఎందుకంటే?
నోటీసుపై పీసీబీ అధికారిక ప్రకటనలో వివరాలు తెలిపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) దాదాపు ఒకే సమయంలో జరుగుతుండడంతో దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్‌కు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభమవుతుంది.
ఇది మే 25 వరకు ఉంటుంది. మరోవైపు, పీఎస్ఎల్ ఏప్రిల్ 11 నుంచి మే 18న వరకు జరగాల్సి ఉంది. దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్ పీఎస్‌ఎల్‌లో ఆడాల్సి ఉంది. ఇంతలో వారం రోజుల క్రితం ఐపీఎల్‌లో ఆడేందుకు అతడు ఒప్పందం చేసుకున్నాడు.
ఐపీఎల్‌లో ఆడాల్సిన దక్షిణాఫ్రికా ఆటగాడు లిజాద్ విలియమ్స్ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వెనుదిరగడంతో అతడి స్థానంలో కార్బిన్ బాష్‌ను ముంబై ఇండియన్స్ తీసుకుంది. పీఎస్‌ఎల్‌ను వద్దనుకుని మరీ కార్బిన్ బాష్‌ను ఐపీఎల్ ఆడేందుకు సంతకం చేశాడు.
Also Read: టీమిండియాలోకి రీ ఎంట్రీపై చాహల్ ఆసక్తికర కామెంట్స్
దీంతో కార్బిన్ బాష్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు లీగల్ నోటీసు పంపింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)కు సంబంధించిన ఒప్పందాన్ని ఆయన ఉల్లంఘించినట్లు చెప్పింది. పీఎస్‌ఎల్ టీ20 టోర్నమెంట్ కోసం కార్బిన్ బాష్‌ను ఓ ఫ్రాంచైజ్ తీసుకుంది. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే కార్బిన్ బాష్ తాను పీఎస్‌ఎల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని వదులుకోవాలి.
కార్బిన్ బాష్‌కు పంపిన నోటీసుపై పీసీబీ అధికారిక ప్రకటనలో వివరాలు తెలిపింది. “కార్బిన్ బాష్‌కు చెందిన ఏజెంట్ ద్వారా అతడికి లీగల్ నోటీసు పంపాము. కాంట్రాక్టు, ప్రొఫెషనల్ కమిట్‌మెంట్లను ఉపసంహరించుకోవడం వంటి చర్యలను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ఆదేశించాం” అని తెలిపింది. కాగా, బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన బాష్.. దక్షిణాఫ్రికా తరఫున ఒక టెస్ట్, రెండు వన్డేల్లో ఆడాడు. 86 టీ20లు ఆడాడు.