మరో క్లబ్‌లోకి: టాప్ 3 స్థానాన్ని దక్కించుకున్న ధోనీ

మరో క్లబ్‌లోకి: టాప్ 3 స్థానాన్ని దక్కించుకున్న ధోనీ

Updated On : January 26, 2019 / 11:02 AM IST

ఫామ్ కోల్పోయాడు పనైపోయింది. ఇక రిటైర్ అవ్వాల్సిందేనని విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు మూయించాడు టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ నుంచి మరోసారి దూకుడు మొదలెట్టేశాడు. న్యూజిలాండ్‌తో ఆడుతున్న టీమిండియాలోనూ భాగమైన ధోనీ వన్డే కెరీర్‌లో అరుదైన ఘనత నమోదు చేసుకున్నాడు. న్యూజిలాండ్‌‌తో మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా శనివారం జరుగుతున్న రెండో వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ 33 బంతుల్లో 48 పరుగులు అజేయంగా పూర్తి చేశాడు. 

 

ఈ మ్యాచ్‌ ఆడటం ద్వారా భారత్ తరఫున అత్యధిక వన్డేలకు ప్రాతినిథ్యం వహించిన మూడో క్రికెటర్‌గా ధోనీ రికార్డుల్లో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో 2004, డిసెంబరు 23న జరిగిన మ్యాచ్‌తో వన్డే ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ.. ఇప్పటి వరకూ భారత్ తరఫున 334 వన్డే మ్యాచ్‌లలో ఆడాడు. వాస్తవానికి ఈ మాజీ కెప్టెన్ కెరీర్‌లో ఇప్పటికే 337 వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. అయినప్పటికీ ఇందులో 3 మ్యాచ్‌లు ఆసియా ఎలెవన్ తరఫున ఆడినవి. 

 

సచిన్ టెండూల్కర్ 463 వన్డేలతో టీమిండియా తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక తర్వాతి స్థానాల్లో రాహుల్ ద్రవిడ్ 340 మ్యాచ్‌లతో ఉన్నాడు. తాజాగా ఈ జాబితాలో 334 మ్యాచ్‌లు ఆడి  మూడో స్థానంలోకి చేరుకున్నాడు ధోనీ. మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ సరసన నిలిచాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డేల అనంతరం ధోనీ మళ్లీ ఈ ఫార్మాట్‌లో ఆడేది 2019 మే నెలలో ప్రపంచకప్‍‌లో మాత్రమే. ఆ తర్వాత తన క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనే సందేహాలు ఉన్నాయి.