ENG vs IND : ఇదేందయ్యా.. ఓ పక్క ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటిస్తే.. భారత్ మాత్రం మల్లగుల్లాలు పడుతుందే..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ENG vs IND 1st test Team india cunfused at Playing Xi
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపటి (శుక్రవారం జూన్ 20) నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు రెండు రోజుల ముందే ఈ మ్యాచ్ కోసం తమ తుది జట్టును ప్రకటించింది. అయితే.. భారత్ మాత్రం జట్టు కూర్పు విషయంలో ఇంకా ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చెప్పిన విషయాలను బట్టి తుది జట్టు కూర్పు విషయంలో మేనేజ్‌మెంట్‌కు ఇంకా స్పష్టత రాలేదు. రెండు స్థానాల పై మాత్రమే పంత్ స్పష్టత ఇచ్చాడు. కోహ్లీ నిష్ర్కమణ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నాడని పంత్ తెలిపాడు. యథావిధిగా తాను ఐదో స్థానంలో బ్యాటింగ్ రానున్నట్లు చెప్పాడు.
ENG vs IND : దురదృష్టం అంటే కరుణ్ నాయర్‌దే.. ప్రాక్టీస్‌లో గాయం..! తొలి టెస్టుకు డౌటే..!
ఇక మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. ప్రస్తుతం దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. జేమ్స్ అండర్సన్, సువర్ట్ బ్రాడ్‌లు రిటైర్‌మెంట్ కావడంతో ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీన పడిందని, అయితే.. ఆ జట్టులో ప్రతిభావంతమైన బౌలర్లు ఉన్నారన్నాడు. ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదన్నాడు.
సాయి సుదర్శన్ అరంగ్రేటం ఖాయమేనా?
పంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం భారత తుది జట్టుపై కూర్పు పై మరోసారి సందిగ్దం నెలకొంది. సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడా? ‘ట్రిపుల్ సెంచూరియన్’ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తాడా అన్నది ఆసక్తి అందరిలో నెలకొంది.
ఒకవేళ సాయి సుదర్శన్ అరంగ్రేటం చేస్తే మాత్రం అతడు యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. లేదంటే కేఎల్ రాహుల్, యశస్వి ఓపెనర్లుగా వస్తారు. నాలుగు, ఐదో స్థానాలు ఖరారు అయిన నేపథ్యంలో కరుణ్ నాయర్‌ను తుది జట్టులో తీసుకుంటే అతడిని ఏ స్థానంలో ఆడిస్తారో చూడాల్సిందే. మొత్తంగా గంభీర్, గిల్ కలిసి ఎలాంటి కూర్పుతో తొలి టెస్టులో బరిలోకి దిగుతారో చూడాల్సిందే.