ENG vs IND : మురిపించారు.. మళ్లీ ఏడిపించరు గదా.. 90 ఓవర్లు.. 8 వికెట్లు..
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా పోరాడుతోంది.

How long did gill and rahul fight back in fourth test
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా పోరాడుతోంది. 311 పరుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరకముందే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఆఖరి రోజు వరకు వెలుతుందని దాదాపుగా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇక భారత్‌కు ఇన్నింగ్స్ ఓటమి ఖాయం అని దాదాపుగా అంతా ఫిక్స్ అయ్యారు.
అయితే.. టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (78 నాటౌట్; 167 బంతుల్లో 10 ఫోర్లు), ఓపెనర్ కేఎల్ రాహుల్ (87 నాటౌట్; 210 బంతుల్లో 8 ఫోర్లు) ప్రతికూల పరిస్థితుల్లో అసాధారణ పోరాటమే చేశారు. దాదాపు రెండున్నర సెషన్లకు పైగా నిలిచి నాలుగో రోజు మరో వికెట్ పడకుండా ఆడారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
ఫలితంగా నాలుగో టెస్టు మ్యాచ్‌లో డ్రా మీద సగటు భారత అభిమానికి ఆశలు చిగురించాయి. ఇక ఆఖరి రోజు వీరిద్దరు మరో సెషన్ నిలిచి.. మిగిలిన బ్యాటర్లు తలా ఓ చేయి వేస్తే మాంచెస్టర్ మ్యాచ్‌లో భారత్ డ్రాతో గట్టెక్కనుంది. అయితే.. భారత జట్టు ఇంకా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 137 పరుగులు వెనుకబడి ఉంది. ఐదో రోజు మ్యాచ్‌లో భారత్ ఈ పరుగులను దాటడంతో పాటు ఇంకా ఎక్కువ పరుగులు చేయాలి. లేదంటే రోజంతా అంటే.. దాదాపు 90 ఓవర్ల పాటు టీమ్ఇండియా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవాలి.
అయితే.. అది అంత ఈజీ కాదు.. ఐదో రోజు ఉదయం కొత్త బంతితో జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్, కార్స్‌లను ఎదుర్కొనడం చిన్న విషయం కాదు. రాహుల్, శుభ్‌మన్‌లు ఔట్ అయితే.. ఆ తరువాత రిషబ్ పంత్ మాత్రమే ప్రధాన బ్యాటర్. అయితే.. అతడు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. పంత్ తరువాత వచ్చే ముగ్గురు ఆల్‌రౌండర్లు. దీంతో రాహుల్, గిల్ ఐదో రోజు ఎంత సేపు క్రీజులో ఉంటారు అన్న దానిపైనే మ్యాచ్ ను భారత్ డ్రా గా ముగిస్తుందా? లేదా సిరీస్‌ను ప్రత్యర్థికి అప్పగించేస్తుందా? అన్నది ఆధారపడి ఉంటుంది.