IND vs PAK : రాణించిన రిజ్వాన్, షకీల్.. భారత టార్గెట్ ఎంతంటే ?
పాక్‌తో మ్యాచ్‌లో భారత్ ముందు ఓ మోస్తరు లక్ష్యం నిలిచింది.

IND vs PAK
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓ మోస్తరు స్కోరును సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ ( 62; 76 బంతుల్లో 5 ఫోర్లు)హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46; 77 బంతుల్లో 3 ఫోర్లు) రాణించాడు.
ఖుష్‌దిల్ షా (38), బాబర్ ఆజామ్ (23)లు ఫర్వాలేదనిపించారు. ఇమామ్ ఉల్ హక్ (10), ఆఘా సల్మాన్ (19), తయ్యబ్ తాహిర్ (4)లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాలు తలా ఓ వికెట్ సాధించారు.
IND vs PAK : అరెరె అదా సంగతి.. స్టాండ్స్‌లో ప్రియురాలు.. గ్రౌండ్‌లో రెచ్చిపోతున్న ప్లేయర్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు ఓపెనర్లు బాబర్ ఆజామ్, ఇమామ్ ఉల్ హక్‌లు తొలి వికెట్ కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. చాన్నాళ్ల తరువాత బాబర్ ఆజామ్ మంచి టచ్‌లో కనిపించాడు. 5 ఫోర్లు బాది క్రీజులో పాతుకుపోయినట్లు కనిపించాడు. బాబర్‌ను ఔట్ చేసి హార్దిక్ భారత్‌కు తొలి వికెట్‌ను అందించారు.
ఫఖార్ జమాన్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన ఇమామ్ ఉల్ హక్ ఆరంభం నుంచి తడబడ్డాడు. అయితే.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సింగిల్ కోసం ప్రయత్నించి అక్షర్ పటేల్ వేసిన సూపర్ త్రోతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 47 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది.
ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను సౌద్ షకీల్, కెప్టెన్ రిజ్వాన్‌లు భుజాన వేసుకున్నారు. ఆరంభంలో ఈ జోడీ క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆ తరువాత క్రమంగా జోరు పెంచింది. సింగిల్స్, డబుల్స్, ఫోర్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. ఈ క్రమంలో సౌద్ షకీల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని రిజ్వాన్‌ను ఔట్ చేయడం ద్వారా అక్షర్ పటేల్ విడగొట్టాడు. రిజ్వాన్-సౌద్ షకీల్ జోడి మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
IND vs PAK : అక్షర్ పటేల్ సూపర్ త్రో.. మేనల్లుడు రనౌట్.. మామయ్య ఫోటోతో మీమ్స్..
ఈ సమయంలో భారత బౌలర్లు విజృంభించారు. రిజ్వాన్ ఔటైన కాసేపటికే సౌద్ షకీల్‌తో పాటు తయ్యబ్ తాహిర్ పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆఖరిలో ఖుష్దిల్ షా, నదీమ్ షాలు రాణించడంతో పాక్ ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైంది.