Shubman Gill : మ్యాగీ కంటే ఫాస్ట్‌గా శుభ్‌మన్ గిల్.. నువ్వు తోపు సామీ..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) బ్యాటింగ్‌లో మరోసారి నిరాశ పరిచాడు.
IND vs SA 1st T20 Shubman Gill fail just 2 runs
Shubman Gill : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో మరోసారి నిరాశ పరిచాడు. మంగళవారం కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అతడు ఘోరంగా విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొన్న గిల్ ఓ ఫోర్ కొట్టి ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్‌లో మార్కో జాన్సెన్ క్యాచ్ అందుకోవడంతో గిల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు.
దీంతో సోషల్ మీడియా వేదికగా శుభ్‌మన్ గిల్ పై విమర్శలు వస్తున్నాయి. ఇంత త్వరగా మ్యాగీ కూడా కాదు అంటూ గిల్ పై సెటైర్లు వేస్తున్నారు. అదే సమయంలో సంజూ శాంసన్‌ను కావాలనే బలి చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ పెద్దగా రాణించడం లేదు. టీ20ల్లో సంవత్సరం పాటు రెగ్యులర్ ఓపెనర్‌గా రాణించిన సంజూ శాంసన్‌ను కాదని గిల్‌ను ఓపెనింగ్‌కు పంపిస్తున్నారు. తనకు ఎంతో అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలో గిల్ రాణించకలేకపోతున్నాడు.
అదే సమయంలో గిల్ రావడంతో సంజూ శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించారు. మూడు నుంచి ఎనిమిది స్థానంలో ఆడించగా అతడు అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతడికి తుది జట్టులో స్థానం లభించడం లేదు. గిల్ విఫలం అవుతుండడంతో సంజూను తుది జట్టులోకి తీసుకుని ఓపెనర్‌గా ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (59 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్థశతకాన్ని బాదాడు. తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23)లు పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీశాడు. లుథో సిపామ్లా రెండు వికెట్లు పడగొట్టాడు. డోనోవన్ ఫెర్రీరా ఓ వికెట్ సాధించాడు.
176 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 101 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (22) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లు తలా రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబెలు చెరో వికెట్ సాధించారు.
