IPL 2025: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. ఐపీఎల్ రద్దవుతుందా.. బీసీసీఐ ఏం చెప్పిందంటే..?
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

IPL 2025
IPL 2025: భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ గురువారం రాత్రి భారత్ లోని పలు సరిహద్దు ప్రాంతాలపై వైమానిక దాడులు నిర్వహించింది. అయితే, భారత్ ఆర్మీ పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. సరిగ్గా గురువారం రాత్రి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాక్ భారత్ పై దాడులకు తెగబడింది. దీంతో ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ భద్రత కారణాల రిత్యా అర్ధంతరంగా రద్దయింది.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కాదని అందరూ భావించారు. కానీ, మ్యాచ్ మొదలైంది. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ఆ సమయంలో స్టేడియంలోని ఓవైపు ప్లడ్ లైట్లు ఆగిపోయాయి. దీంతో కొద్దిసమయం తరువాత మ్యాచ్ జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ, మ్యాచ్ ను అర్ధంతరంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ ల నిర్వహణ పై నీలినీడలు కమ్ముకున్నాయి.
ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సాంకేతిక లోపం కారణంగా రద్దు చేయబడిందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. బీసీసీఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుందని, ఐపీఎల్ నిర్వహణపై ప్రభుత్వ సలహాను కోరుతోందని అన్నారు. పరిస్థితి రోజురోజుకూ మారుతున్నందున ఇవాళ ఐపీఎల్ నిర్వహణ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
‘‘మాకు ఏది చెబితే అది మేము చేస్తాము. సమాచారాన్ని అన్ని ప్రాంచైజీలకు తెలియజేస్తాం. ప్రస్తుతానికి ఆటగాళ్లు, అభిమానులు, ప్రాంచైజీల భద్రతే మా ప్రాధాన్యత’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ లక్నోలో జరగాల్సిన లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా..? రద్దవుతుందా? అనేది క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.