Rishabh Pant Injury : రిషబ్ పంత్ కు తీవ్ర గాయం.. నొప్పితో విలవిల.. కాలు ఉబ్బిపోయి నడవలేని స్థితిలో..

Rishabh Pant Injury

Rishabh Pant Injury : రిషబ్ పంత్ కు తీవ్ర గాయం.. నొప్పితో విలవిల.. కాలు ఉబ్బిపోయి నడవలేని స్థితిలో..

Updated On : July 24, 2025 / 12:42 AM IST

Rishabh Pant Injury : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా పంత్‌కు తీవ్ర గాయమైంది. క్రిస్‌ వోక్స్ బౌలింగ్‌ లో పంత్ స్వీప్‌ షాట్ ఆడబోయాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. ఫిజియో వచ్చి చికిత్స చేస్తుండగా పంత్ నొప్పితో విలవిలలాడాడు.

కాలు ఉబ్బిపోయి నడవలేని స్థితిలో ఉండటంతో అతడిని ప్రత్యేక వాహనంలో మైదానం నుంచి తీసుకెళ్లారు. రిటైర్డ్ హర్ట్ గా పంత్ గ్రౌండ్ ను వీడాడు. పంత్ 48 బంతుల్లో 37 పరుగులు చేశాడు. కాగా, గాయం తీవ్రమైనదిగానే కనిపిస్తుండటంతో పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగుతాడో? లేదో? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పంత్ గాయంతో వెళ్లిపోవడంతో అతడి ప్లేస్ లో రవీంద్ర జడేజా వచ్చాడు. కాగా మూడో టెస్టులోనూ పంత్ చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే.

పంత్ గాయంపై హెడ్ కోచ్ గంభీర్ స్పందించాడు. పంత్ పాదానికి తీవ్ర గాయం కావడంతో స్కాన్‌ల కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపాడు. పంత్ గాయం పట్ల గంభీర్, కెప్టెన్ గిల్ ఆందోళన చెందుతున్నారు. పంత్ గాయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. “మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ కుడి పాదానికి గాయమైంది. అతన్ని స్టేడియం నుండి స్కాన్ల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

BCCI వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది” అని BCCI అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే గాయాల కారణంగా పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకి దూరమయ్యారు. ఆకాశ్ దీప్, అర్ష్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి గాయాలతో పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు పంత్ కు తీవ్ర గాయం కావడంతో మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

కాగా, పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన విదేశీ వికెట్ కీపర్ గా ఘనత సాధించాడు. పంత్ ఇప్పటివరకు ఆ దేశంలో వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు (89) బాదిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ (88) రికార్డును బ్రేక్ చేశాడు. మరో మూడు సిక్సులు కొడితే వీరేంద్ర సెహ్వాగ్ (91) రికార్డును కూడా బద్దలు కొడతాడు.