MI vs SRH : 300 లోడింగ్.. ముంబైతో సన్‌రైజర్స్ మ్యాచ్ నేడే.. హెడ్-టు-హెడ్, పిచ్ రిపోర్టు..
గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

MI vs SRH
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇక నేడు మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ తన చివరి మ్యాచ్‌లో పంజాబ్ పై గెలిచింది. అదే ఊపును ముంబై పై కంటిన్యూ చేయాలని కోరుకుంటుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు హైదరాబాద్ 6 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్‌రేట్ -1.245గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్ అతిపెద్ద సానుకూలాంశం. వీరిద్దరితో పాటు ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలు ఆటగాళ్లు రాణిస్తే ముంబై కి కష్టాలు తప్పవు.
ఇక ముంబై విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కూడా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. చివరి మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. సన్‌రైజర్స్ పై గెలిచి విజయయాత్రను కంటిన్యూ చేయాలని కోరుకుంటుంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచిన ముంబై ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.104గా ఉంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్‌లు రాణిస్తే భారీ స్కోర్ సాధించొచ్చు.
హెడ్-టు-హెడ్..
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు 23 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో ముంబై జట్టు 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఓ మ్యాచ్ లో ఫలితం తేలలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు ఎనిమిది మ్యాచ్‌ల్లో తలపడగా 5 మ్యాచ్‌ల్లో ముంబై గెలవగా, రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
పిచ్ రిపోర్ట్..
వాంఖడే మైదానంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇరు జట్లలోనూ బిగ్ హిట్టర్లు ఉండడంతో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
తుది జట్ల అంచనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఈషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కత్
ముంబై ఇండియన్స్..
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ