Champions Trophy final : భారత్‌తో అలా ఆడతాం.. న్యూజిలాండ్ స్ట్రాటజీని బయటపెట్టిన విలియమ్సన్..
ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.

Kane Williamson reveals New Zealand strategy for Champions Trophy 2025 final against India
బుధవారం కరాచీ వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ స్టేజీలో భారత్ చేతిలో కివీస్ ఓడిపోయింది. ఈ క్రమంలో ఫైనల్‌లో న్యూజిలాండ్ ఎలాంటి అప్రోచ్‌తో బరిలోకి దిగనుందనే విషయాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు.
సెమీస్‌లో దక్షిణాఫ్రికా పై శతకంతో చెలరేగాడు కేన్ విలియమ్సన్. మొత్తం 94 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులు సాధించాడు. కేన్ మామతో పాటు రచిన్ రవీంద్ర (108) సెంచరీ చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది.
అనంతరం డేవిడ్ మిల్లర్ (67 బంతుల్లో 100 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగినప్పటికి దక్షిణాప్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులకే పరిమితమైంది. దీంతో కివీస్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఫైనల్ మ్యాచ్ పై సెమీస్ మ్యాచ్ అనంతరం విలియమ్స్‌న్ మాట్లాడాడు. భారత జట్టును ప్రశంసించాడు. భారత జట్టు అద్భుతంగా ఆడుతోందని కితాబిచ్చాడు. గ్రూప్ స్టేజీలో భారత్ పై ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఫైనల్‌లో ఏదైన జరగొచ్చునని చెప్పాడు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం ఎంతో ముఖ్యం అన్నాడు. సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతామని, హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్ జరగడం ఖాయమన్నాడు.
పాకిస్థాన్, దుబాయ్‌లలో ఆట పరిస్థితులు ఒకేలా ఉండవన్నాడు. పాక్‌తో పోల్చుకుంటే దుబాయ్ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయన్నాడు. సెమీస్‌లో గెలవడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. అయితే.. ఈ విజయం గురించి పక్కన బెట్టి ఫైనల్ మ్యాచ్ పై దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చాడు. పరిస్థితులను త్వరగా ఆకలింపు చేసుకుని ఫైనల్‌లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తామని విలియమ్సన్ చెప్పాడు.