IND vs AUS : అసాధారణ వర్షం తరువాత పెర్త్ పిచ్ ఎలా స్పందిస్తుంది? క్యూరేటర్ ఏం చెప్పాడంటే?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Perth Test curator reveals how pitch will play after unusual spell of rain
IND vs AUS : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే.. పెర్త్‌లో ప్రస్తుతం అసాధారణ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పిచ్ సన్నాహాలపై ఇది ప్రభావం చూపిందని పెర్త్ టెస్ట్ చీఫ్ క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు. అయినప్పటికి పిచ్ ఎప్పుడూ ఉన్నట్లే బౌన్స్, స్వింగ్‌ను కలిగి ఉంటుందన్నాడు.
ఆప్టస్ స్టేడియం, WACA మైదానం రెండింటిలోని పిచ్‌లు వాటి పేస్, బౌన్స్‌కు ప్రసిద్ధి చెందాయి. అయితే.. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పిచ్ పై పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇవి సీమర్లతో పాటు స్పిన్‌కు సాయం చేస్తుంటాయన్నాడు. ఇటీవల నిరంతరాయంగా వర్షం కురవడంతో మంగళవారం మొత్తం పిచ్ ను కవర్లతో కప్పి ఉంచినట్లు చెప్పాడు. దీంతో పిచ్ తయారీ చేసేందుకు ఉన్న సమయంలో ఒక రోజును కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు.
అందుకనే ఈ ఉదయం చాలా తొందరగా పిచ్ ప్రిపరేషన్ మొదలుపెట్టామన్నాడు. సాధ్యమైనంత మేర ఉత్తమ పిచ్‌ను అందించేందుకే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఎండ వస్తే బాగుంటుందని చెప్పాడు. మ్యాచ్ ఆరంభ రోజు పిచ్ పై తేమ ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. ఐదు రోజుల పాటు పిచ్ ఒకే విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని, వర్షం కారణంగా పెద్ద నష్టం ఉండదని అంచనా వేస్తున్నట్లు తెలిపాడు.
బంతికి, బ్యాట్‌కు మధ్య సమాన పోటీ ఉండేలా పిచ్‌ను రూపొందిస్తున్నామని చెప్పాడు. రోలింగ్ చేయడంతో పాటు తేమ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇటీవల వన్డే మ్యాచ్‌లో (4mm) ఉపయోగించిన పిచ్‌తో పోలిస్తే గడ్డి కాస్త ఎక్కువగా ఉంటుందన్నాడు. 8 నుంచి 10mm పచ్చిక ఉంటుందని చెప్పాడు. గంట గంటకు వికెట్‌ను పరీక్షిస్తున్నాము. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని చెప్పాడు.
Virat Kohli : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. అరుదైన రికార్డుపై కోహ్లీ కన్ను..