సచిన్ కోపిష్టి, ధోనీ మిస్టర్ కూల్ అంటున్న రవిశాస్త్రి

నిర్ణయాత్మక వన్డేలో కీలకంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా నిలిచిపోతాడని కొనియాడాడు. డకౌట్ అయినా, సెంచరీ కొట్టినా, ప్రపంచ కప్ గెలిచినా, తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఒకే విధంగా స్వీకరించే ధోని స్వభావం తనను ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతతను కోల్పోని వ్యక్తిత్వమని కొనియాడాడు.
ఆటలో కొనసాగుతున్న కాలంలో కొన్ని సందర్భాల్లో సచిన్‌లో కోపాన్ని చూశా. కానీ, ధోనిలో ఇంతవరకు అలాంటిదేమీ కనిపించలేదు. 30–40 ఏళ్లకోసారి మాత్రమే ఇలాంటి ఆటగాళ్లు వస్తారు. కీపర్‌గా ఆటను అతడు చూసే కోణం వేరు. కుర్రాళ్లతో బాగా ఉంటాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో వారంతా ధోనిని గొప్పగా చూస్తారు. బ్యాట్స్‌మన్‌గానే గాకుండా మంచి వ్యూహకర్తగానూ జట్టుకు బలంగా నిలుస్తాడు. ధోనీ రిటైర్ అయితే మాత్రం అతని స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. పంత్ అలా తయారైతే బాగుంటుంది. ప్రస్తుత జట్టు మొత్తం ధోనీ కెప్టెన్సీలోనే రూపుదిద్దుకుంది. 2011 నుంచి అతనొక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు.
సచిన్, కోహ్లిల మధ్య పోలికలంటే:
సచిన్, కోహ్లిల్లో మీరు గమనించిన పోలికలేమిటని ఒకరు అడిగారు. పరుగుల కోసం తాపత్రయం, నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం, జీవితంలో ముఖ్యమైనవి త్యాగం చేయడం, ఎక్కడా రాజీ పడకపోవడం, ఇతరుల లోపాలను ఎత్తిచూపకపోవడం, తప్పులను అంగీకరించడం.. ఇలా చెప్పేందుకు చాలా ఉన్నాయి. సచిన్ భావాలను ఎక్కువగా ప్రదర్శించడు. కానీ, కోహ్లీ తీరు వేరు. ప్రత్యర్థి ఎవరైనా లెక్కచేయకుండా వివియన్ రిచర్డ్స్ తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. దాంతో పాటు ఎంత గొప్పగా ఎదిగినా హద్దుల్లో ఉంటాడు. జట్టు విషయంలో చాలా బాధ్యతగా ఉంటాడు.